Investers Wealth | రెండు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడంతో బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ ఒక శాతానికి పైగా పతనమైంది. ఫలితంగా సోమవారం ఒక్కరోజే రూ.5.99 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద హరించుకుపోయింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు, వడ్డీరేట్ల తగ్గింపుపై యూఎస్ ఫెడ్ రిజర్వు నిర్ణయంపై ఎదురుచూపుల నేపథ్యంలో దేశీయ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తూ అమ్మకాలకు దిగారు.
దీంతో మార్కెట్ లీడర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మొదలు వివిధ బ్యాంకుల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 941.88 (1.18 శాతం) నష్టంతో 78,782.24 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఆగస్టు ఆరో తేదీ తర్వాత బీఎస్ఈ సెన్సెక్స్ ముగింపు అత్యంత కనిష్టం ఇదే. ఫలితంగా బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,99,539.5 కోట్లు తగ్గిపోయి 4,42,11,068.05 (5.26 లక్షల కోట్ల డాలర్లు) కోట్లకు పడిపోయింది. గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ మీద మూడు శాతం వృద్ధితో 75.29 డాలర్లు పలికింది. గత నెలలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.94 వేల కోట్ల (11.2 బిలియన్ డాలర్లు) విలువైన వాటాలను విక్రయించారు. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు దేశీయ స్టాక్ మార్కె్ట్లలో వాటాలు విక్రయించడం ఇదే అత్యధికం.