హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొంటున్నది. ఈ క్రమంలోనే తమిళనాడు జెన్కో సింగరేణి సంస్థను సంప్రదించగా.. బొగ్గు సరఫరా విషయంపై ఇప్పటికే రెండింటి మధ్య ప్రాథమిక చర్చలు జరిగాయి. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్, తమిళనాడు పవర్ జెన్కో ఎండీ ఎం గోవిందరావులు ఈ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఇరు సంస్థల మధ్య బొగ్గు సరఫరా విషయంలో ఓ ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయి. ఈ డీల్ జరిగితే ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్‌లో వెలికితీస్తున్న బొగ్గును తమిళనాడు జెన్కోకు సింగరేణి సరఫరా చేయనుందంటున్నారు.
సింగరేణి తెలంగాణలోనేగాక.. ఒడిశాలోనూ బొగ్గు గనిని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక తమిళనాడులోని తూతుకుడి జిల్లాలోగల ఉడంగుడిలో 1,200 మోగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు బొగ్గు కావాల్సి ఉన్నది. ఈ క్రమంలోనే అక్కడి జెన్కో సింగరేణితో సంప్రదింపులు జరిపింది. కాగా, నైనీ బొగ్గు బ్లాక్ నుంచి జీ-11 గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతున్నది. ఈ బొగ్గును కొనేందుకు తమిళనాడు జెన్కో ఆసక్తి చూపుతున్నది. పైగా నైనీ బ్లాక్ సమీపంలోనే రైల్వే లైన్లు, పోర్టులున్నాయి. దీంతో రైలు, సముద్ర మార్గం ద్వారా ఈ బొగ్గును సరఫరా చేసే విషయంపై ఇరు సంస్థలు ఓ పరస్పర అంగీకారానికి కూడా వచ్చినట్టు సమాచారం. మొత్తానికి ఒప్పందం ఖరారైతే ఏటా 2.88 మిలియన్ టన్నుల బొగ్గును సింగరేణి.. తమిళనాడు జెన్కోకు సరఫరా చేయనున్నది.