హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): ప్రముఖ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంస్థ పీఎస్ఆర్ టెక్ హబ్ తాజాగా హైదరాబాద్‌లో తన గ్లోబల్ డెలివరీ సెంటర్‌ను నెలకొల్పింది. 7 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధస్సు రావడంతో సాఫ్ట్వేర్ రంగం పూర్తిగా మారిపోయిందని, భవిష్యత్తులో అ రంగంలో అపారమైన ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. ఈ రంగాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో ఏఐ సిటీని ఏర్పాటు చేయడానికి 200 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. ఏఐ రంగంలో విస్తృత పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు చొరవ తీసుకుంటామని తెలిపారు. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుచేసి పరిశ్రమకు అవసరమైన నిపుణులను అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. పీఎస్ఆర్ టెక్ హబ్ చైర్మన్, ఎండీ పుల్లూరి శ్రీరంగారావు మాట్లాడుతూ…ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ డెలివరీ సెంటర్ దోహదం చేయనున్నదన్నారు.
మరో 150 ఉద్యోగాలు
భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది పీఎస్ఆర్ టెక్ హబ్. ఇప్పటికే హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ప్రధాన కార్యాలయంలో 220 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా, కొత్తగా ఏర్పాటు చేసిన గ్లోబల్ డెలివరీ సెంటర్ కోసం 60 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు పీఎస్ఆర్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం తెలిపారు. వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం సిబ్బంది సంఖ్యను 400కి పెంచుకోవాలనుకుంటున్నట్లు చెప్పా రు. అలాగే ప్రస్తుతం సంస్థకు 2 వేల క్లయింట్లు ఉండగా, వీటిలో 800 యాక్టివ్ క్లయింట్లు అని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో క్లయింట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలను వేగవంతం చేసినట్లు, ఇప్పటికే సింగపూర్, అమెరికాలో కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.