ముంబై, జూన్ 14: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రుణాలపై వడ్డీరేట్లు తగ్గాయి. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్)ను అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించినట్టు బ్యాంక్ ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈబీఎల్ఆర్ 8.65 శాతం నుంచి 8.15 శాతానికి దిగొచ్చింది. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) జరిపిన ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎస్బీఐ తాజా నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించిన సంగతీ విదితమే.
ఎస్బీఐ ఈబీఎల్ఆర్ తగ్గింపు రుణగ్రహీతలకు, ముఖ్యంగా గృహ రుణగ్రహీతలకు లాభించనున్నది. ఈబీఎల్ఆర్తో అనుసంధానమైన పాత, కొత్త గృహ రుణగ్రహీతలందరికీ తాజా నిర్ణయం ప్రయోజనం చేకూర్చుతుంది. ఈబీఎల్ఆర్ తగ్గింపుతో గృహ రుణాలపై వడ్డీరేట్లు 7.50 శాతం నుంచి 8.45 శాతం మధ్య ఉండనున్నాయి. రుణగ్రహీతల క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఈ వడ్డీరేట్లలో వ్యత్యాసం ఉంటుంది.
ఎస్బీఐ ప్రత్యేకంగా 444 రోజుల కాలపరిమితితో అందిస్తున్న ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) స్కీం ‘అమృత్ వృష్టి’పై పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) వడ్డీరేటు తగ్గింది. ఆదివారం (జూన్ 15) నుంచి సవరించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. కాగా, మిగతా రెగ్యులర్ ఎఫ్డీలపై వడ్డీరేట్లు యథాతథంగానే ఉన్నాయి. గత నెల్లోనే వీటిని సవరించినది తెలిసిందే. అయితే ఇటీవలి ద్రవ్యసమీక్షలో రెపోరేటుకు ఆర్బీఐ అరశాతం కోత పెట్టిన నేపథ్యంలో ఇప్పటికే ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కెనరా తదితర బ్యాంకులు తమ ఎఫ్డీలపై వడ్డీరేట్లను తగ్గించాయి. దీంతో ఎస్బీఐ కూడా ఆ దిశగా అడుగులు వేసింది.
బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సాధారణ కస్టమర్లకు అమృత్ వృష్టి ఎఫ్డీపై 6.60 శాతం వార్షిక వడ్డీరేటు దక్కుతుంది. ఇంతకుముందు ఇది 6.85 శాతంగా ఉన్నది. సీనియర్ సిటిజన్లకు 7.10 శాతం వర్తిస్తుంది. అయితే 80 ఏండ్లు, ఆపై వయసున్న డిపాజిటర్లకు 10 బేసిస్ పాయింట్ల అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో వీరంతా 7.20 శాతం వడ్డీరేటు అందుకోవచ్చు. అయితే అమృత్ వృష్టి ఎఫ్డీలను నిర్ణీత కాలపరిమితి కంటే ముందే ఉపసంహరించుకుంటే జరిమానాలుంటాయి. రూ.5 లక్షలదాకా రిటైల్ టర్మ్ డిపాజిట్లకు సంబంధించి వడ్డీరేటులో 0.50% పెనాల్టీ వర్తిస్తుంది. అలాగే రూ.5 లక్షలు-3 కోట్లలోపుండే రిటైల్ టర్మ్ డిపాజిట్లకు అన్ని టెన్యూర్‌పై 1 శాతం జరిమానా పడుతుంది.