Startup India | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): దేశంలో ఆవిష్కరణలకు ఊతమిస్తామని, స్టార్టప్ ఇండియా అంటూ ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పించడంలో విఫలమయ్యారు. సాఫ్ట్వేర్ రంగ నిపుణులతోపాటు ఇతర టెక్కీలకు తమ ప్రభుత్వం అండగా ఉంటున్నదని, స్టార్టప్ కంపెనీలకు అనుకూలమైన విధానాలు అమలు చేస్తున్నామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పలు చెప్తున్నా.. ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం లేదు.
ఈ ఏడాది ప్రథమార్ధంలో గత ఏడాదితో పోల్చుకుంటే దేశంలోని స్టార్టప్‌లకు విదేశీ ఫండింగ్ తగ్గడంతోపాటు, ఏకంగా 2 లక్షలకుపైగా టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారు మరి. ట్రాక్సన్ సంస్థ నివేదిక ప్రకారం జూన్ 30నాటికి 819 సంస్థలు దాదాపు 2,12,221 మంది ఉద్యోగులను తొలగించాయని తేలింది. గత ఏడాదితో పోల్చితే ఉద్యోగ కోతలు 40 శాతం పెరగడం గమనార్హం. ఇక ఈ ఏడాది జనవరి-జూన్‌లో భారతీయ స్టార్టప్‌లు కేవలం 5.5 బిలియన్ డాలర్ల ఫండింగ్నే సాధించగలిగాయి. నిరుడుతో పోల్చితే ఏకంగా 72 శాతం తగ్గింది. గత ఏడాది జనవరి-జూన్‌లో 19.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఫండింగ్‌కు సంబంధించి చర్చలూ 48 శాతం క్షీణించడం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నది.