హైదరాబాద్, అక్టోబర్ 25(నమస్తే తెలంగాణ): ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియాలోని ఇండియన్ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టి రాష్ట్ర పురోగతిలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శనివారం సిడ్నీలో ‘ది సెంటర్ ఫర్ ఆస్ట్రేలియా-ఇండియా రిలేషన్స్’ ఆధ్వర్యంలో నిర్వహించిన బిజినెస్ కాంక్లేవ్ సందర్భంగా శ్రీధర్ బాబు పలువురు భారతీయ మూలాలున్న సీఈవోలతో భేటీ అయ్యారు.
దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందని ఈ సందర్భంగా ఆయన పేరొన్నారు. తకువ సమయంలో పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ, స్థిరమైన పాలన, సమర్థవంతమైన నాయకత్వం కారణంగా రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత సురక్షితమైన గమ్యస్థానంగా మారిందన్నారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి అనుకూలించే అంశాలు, పెట్టుబడి అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ప్రగతిశీల విధానాలు, ఎకో సిస్టం, సింగిల్ విండో అనుమతుల వ్యవస్థ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏఐ, డాటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, గేమింగ్, యానిమేషన్, వీఎఫ్ ఎక్స్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, అడ్వాన్డ్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఈవీల తయారీ తదితర రంగాల్లో తెలంగాణలో అవకాశాలు పుషలంగా ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని కోరారు.