హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రపంచంలో రెండో అతిపెద్ద బ్రూయింగ్ సంస్థ హైనెకెన్.. హైదరాబాద్‌లో జీసీసీని ప్రారంభించింది. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 76 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను ‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్’గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్టు, జీసీసీలను కేవలం ‘బ్యాక్ ఆఫీస్’ ఆపరేషన్లకే పరిమితం కాకుండా.. స్ట్రాటెజిక్ ఇన్నోవేషన్స్, హై వాల్యూ ప్రొడక్టివిటీకి కేంద్రాలైన గ్లోబల్ వాల్యూ సెంటర్లు(జీవీసీ)గా మార్చేలా ప్రత్యేక రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామన్నారు.
హైనెకెన్ లాంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్‌ను ఎంచుకోవడం ఇకడి ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలు, రెడీ టూ కొలాబరేట్, రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలకు, పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమన్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాల మొదలు.. తయారీ, కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీల వరకు తమ వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు కోసం హైదరాబాద్‌నే మొదటి ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయన్నారు. ఆ జాబితాలో 150 ఏండ్ల చరిత్ర కలిగిన హైనెకెన్ కూడా చేరడం వల్ల ప్రపంచ పటంలో ‘తెలంగాణ బ్రాండ్’ మరింత విశ్వవ్యాప్తమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మందికి పైగా నిపుణులకు ఇకడ ఉపాధి లభిస్తుందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య 1,600కు చేరుకుంటుందని చెప్పారు.