హైదరాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ): తెలంగాణ పురోగతిలో భాగస్వాములవుతున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. చట్టాలు, నిబంధనల పేరుతో పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన తమకు లేదని, వారితోపాటు కార్మికులకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కాపాడుకుంటామన్నారు. బుధవారం మంత్రి శ్రీధర్‌బాబు సచివాలయంలో సీఐఐ, ఫిక్కీ, ఎఫ్‌టీసీసీఐ, ఎలీప్, టిఫ్, టాప్మా, టీఎస్టీఎంఏ తదితర పారిశ్రామిక సంఘాలతో సమావేశమయ్యారు.
రాష్ర్టాభివృద్ధి కోసం అందరి సూచనలు, సలహాలు పాటిస్తామని, పారిశ్రామికాభివృద్ధికి రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కొత్తగా రాష్ర్టానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను ఆయన వివరించడంతోపాటు పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.