బుధవారం 02 డిసెంబర్ 2020
Business - Sep 23, 2020 , 23:52:28

ఇదే సరైన తరుణం

ఇదే సరైన తరుణం

  • మున్ముందు పుత్తడి ధరలు భారీగా పెరిగే అవకాశం
  • 2021 చివరికి రూ.68 వేలకు చేరొచ్చంటున్న నిపుణులు

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అందుకు ఇదే సరైన తరుణం. గత కొంత కాలం నుంచి పుత్తడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.49 వేల వద్ద కదలాడుతున్నది. కనుక పుత్తడి కొనుగోళ్ల విషయంలో మీరు ఎంత త్వరపడితే అంత మంచిది. ఈ విషయంలో ఏ మాత్రం ఆలస్యం చేసినా మీ జేబుకు భారీ చిల్లు పడటం ఖాయం. పుత్తడి ధరల క్షీణత ఎంతో కాలం కొనసాగపోవచ్చని, వచ్చే ఏడాది చివరి నాటికి తులం ధర రూ.68 వేల వరకు పెరుగవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: బంగారం ధరలు గత రెండేండ్లలో విపరీతంగా పెరిగాయి. దేశంలో గతేడాది దాదాపు 19 శాతం బలపడిన పుత్తడి ధర.. ఈ ఏడాది ఇప్పటివరకు మరో 40 శాతం మేరకు ఎగసింది. మున్ముందు ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తున్నది. కరోనా సంక్షోభంతోపాటు పలు ఇతర సమస్యలు ప్రపంచాన్ని పట్టిపీడిస్తుండటం, డాలర్‌ విలువ తగ్గుదల లాంటి అంశాలు బంగారం ధరలకు రెక్కలు తొడగవచ్చన్న విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి. వివిధ కారణాల రీత్యా గత కొంత కాలం నుంచి బంగారం ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఈ ధోరణి ఎంతో కాలం కొనసాగకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో రూ.49 వేల వద్ద కదలాడుతున్న తులం పసిడి ధర వచ్చే ఏడాది చివరి నాటికి రూ.65 వేల నుంచి రూ.68 వేల వరకు పెరుగవచ్చని ‘గోల్డెన్‌ డిప్‌' పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో మోతీలాల్‌ ఓస్వాల్‌ పేర్కొన్నది.

గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల వెల్లువ

మరోవైపు గోల్డ్‌ ఈటీఎఫ్‌ (ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌)లోకి వచ్చే పెట్టుబడులు గత కొంత కాలం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. పుత్తడి ధరల పెరుగుదలకు ఇది దోహదం చేస్తుంది. రెండో త్రైమాసికంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడుల ప్రవాహం మరింత పెరుగడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్ధంలో మొత్తం పెట్టుబడులు రికార్డు స్థాయిలో 734 టన్నులకు చేరాయి. ఇదే సమయంలో అమెరికన్‌ డాలర్‌ విలువ 17 శాతం బలపడటం గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడుల పెరుగుదలకు దోహదం చేశాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) స్పష్టం చేసింది.

మరింత దిగొచ్చిన పసిడి

  • తులం రూ.50,750
  •   రూ.1,900 తగ్గిన వెండి

కొంత కాలం నుంచి క్రమంగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో మంగళవారం రూ.51,364 వద్ద ముగిసిన తులం పసిడి (24 క్యారెట్లు) ధర.. బుధవారం రూ.614 క్షీణించి రూ.50,750కి చేరింది.  అలాగే హైదరాబాద్‌లో ఈ ధర ఏకంగా రూ.700 తగ్గి రూ.48,100కు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడం, అమెరికన్‌ డాలర్‌ విలువ బలపడుతుండటం ఇందుకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ వర్గాలు వెల్లడించా యి. మరోవైపు వెండి ధర కూడా బాగానే తగ్గింది. మంగళవారం రూ.61,618 వద్ద ముగిసిన కిలో వెండి ధర.. బుధవారం రూ.1,898 క్షీణించి రూ.59,720కి దిగివచ్చింది.