ముంబై: చౌకధరలకే విమానయాన్ని అందిస్తున్న స్పైస్ జెట్ (Spice Jet) పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే విమాన సర్వీసులను తగ్గించుకున్న సంస్థ.. తాజా మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మూడు నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఇవ్వకూడదని నిర్ణయించింది. నిధుల లేమి కారణంగా 150 మంది క్యాబిన్ సిబ్బందిని మూడు నెలల పాటు సెలవులపై పంపించనుంది. ఈ కాలంలో వారికి మూడు నెలల పాటు వేతనాలు చెల్లించేదిలేదని తెలిపింది. సంస్థ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే స్పైస్ జెట్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిఘా పెడుతున్నట్లు ప్రకటించింది. స్పైస్ జెట్ ఆపరేషన్స్ సజావుగా సాగేందుకు స్పాట్ చెక్స్, రాత్రి వేళ నిఘా పెంచుతున్నట్లు తెలిపింది. ఆర్థిక పరంగా ఒత్తిళ్ల నేపథ్యంలో స్పైస్ జెట్ విమాన సర్వీసులను రద్దు చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 7,8 తేదీల్లో సంస్థ ఇంజినీరింగ్ వసతులపై నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో కొన్ని లోపాలు కనిపించినట్లు డీజీసీఏ తెలిపింది.
స్పైస్ జెట్ గత రికార్డుతోపాటు ఈ నెలలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీ నేపథ్యంలో ఆ సంస్థ కార్యకలాపాలపై తక్షణం నిఘా పెంచుతున్నట్లు డీజీసీఏ వివరించింది. దీని ప్రకారం పలు దఫాలు స్పాట్ చెక్స్, రాత్రి వేళ నిఘా చర్యలు పెరుగుతాయి. స్పైస్ జెట్ విమాన సర్వీసులు సురక్షితంగా సాగేందుకే తాము ఈ చర్య తీసుకుంటున్నట్లు డీజీసీఏ గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.