SpiceJet-Ajay Singh | దేశీయ పౌర విమానయాన సంస్థ ‘స్పైస్ జెట్’ చైర్మన్ అజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. యూరోపియన్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్‌కు రుణ బకాయిలు చెల్లించనందుకు మిలియన్ డాలర్లతో కలిపి ఐదు లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ నెల 22 లోపు చెల్లించాలని, లేదంటే తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని సోమవారం హెచ్చరించింది.
‘మేం తదుపరి తీవ్రమైన చర్య తీసుకోవాల్సి ఉంది. మీరు సంస్థను మూసేసినా మాకు ఆందోళన లేదు. ఈ దాగుడు మూతల వ్యవహారం ఇక చాలు. మీరు షరతులకు కట్టుబడి ఉండాల్సిందే. మీరు ఒకవేళ మరణించినా మేం బాధపడం.. ఇది చాలా తీవ్రమైన అంశం’ అని జస్టిస్‌లు విక్రమ్ నాథ్, అహ్సనుద్దీన్ అమానుల్లాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ఇక నుంచి ప్రతి విచారణకు హాజరు కావాల్సిందేనని అజయ్ సింగ్‌ను న్యాయస్థానం ఆదేశించింది.
2015 నుంచి క్రెడిట్ సూయిజ్, స్పైస్ జెట్ మధ్య న్యాయ వివాదం కొనసాగుతున్నది. తమకు 24 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని క్రెడిట్ సూయిజ్ ప్రకటించింది. దీనిపై మద్రాస్ హైకోర్టును క్రెడిట్ సూయిజ్ ఆశ్రయించింది. 2021లో స్పైస్ జెట్ సంస్థను మూసేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై స్పైస్ జెట్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సస్పెండ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఇరుపక్షాలు చర్చించుకుని పరిష్కారానికి రావాలని ఆదేశించింది. గతేడాది ఆగస్టులో ఇరు పక్షాలు వివాద పరిష్కారానికి అంగీకారం అని సుప్రీంకోర్టుకు తెలిపాయి. కానీ, ఇరు పక్షాల మధ్య కుదిరిన సెటిల్మెంట్ ప్రకారం కూడా బకాయిలు చెల్లించలేదు స్పైస్ జెట్. దీంతో గత మార్చిలో స్పైస్ జెట్’పై క్రెడిట్ సూయిజ్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేసింది.