రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును తగ్గించిన నేపథ్యంలో దేశంలోని చాలా బ్యాంకులు తమ రుణాలపైనేగాక, ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పైనా వడ్డీరేట్లను తగ్గించేస్తున్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అత్యధికంగా 8 శాతంపైనే ఎఫ్డీలకు వడ్డీరేట్లను ఆఫర్ చేస్తున్నాయి. ముఖ్యంగా పలు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు (ఎస్ఎఫ్బీ)లు సీనియర్ సిటిజన్లకు 8 శాతం, అంతకంటే ఎక్కువే వార్షిక వడ్డీరేట్లను ఇస్తామంటున్నాయి. కానీ ఈ ప్రత్యేక రేట్లు ఎంపిక చేసిన కాలవ్యవధులకే వర్తిస్తాయి.
చాలామంది డిపాజిటర్లు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఎఫ్డీలు చేయడానికి సంశయిస్తున్నారిప్పుడు. ఇందుకు కారణం తాము చేసే ఎఫ్డీలకు బీమా భరోసా ఉందా? లేదా? అన్న అనుమానమే. అయితే ప్రస్తుత నిబంధనల ప్రకారం.. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లోనూ రూ.5 లక్షలదాకా ఎఫ్డీలకు ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) పూచీకత్తు ఉంటున్నది. దీంతో మదుపరులకు భయం అవసరం లేదనే చెప్పవచ్చు.
దేశంలోని అన్ని బ్యాంకుల తరహాలోనే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపైనా ఆర్బీఐ పర్యవేక్షణ ఉంటుంది. వీటికీ ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్ రూల్స్ వర్తిస్తాయి. ఆర్బీఐ ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించాల్సిందే.
ఏప్రిల్ 1 నుంచి సీనియర్ సిటిజన్ల ఎఫ్డీ లపై టీడీఎస్ నిబంధనల్ని సవరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎఫ్డీపై వడ్డీ ఆదాయం లక్ష రూపాయలు దాటితే పన్ను కోతలుంటాయి. సాధారణ ప్రజానీకానికైతే రూ.50వేలు దాటితే టీడీఎస్ ఉంటుంది.