న్యూఢిల్లీ, మే 14: కస్టమర్లను ఆకట్టుకొనేందుకు ఆయా బ్యాంకులు ఎప్పటికప్పుడు ప్రత్యేక పథకాలతో వస్తున్నాయి. అయితే నిధుల సమీకరణే లక్ష్యంగా ఇటీవలికాలంలో తెస్తున్న ఈ స్పెషల్ స్కీములపై అధిక వడ్డీరేట్లను ఆఫర్ చేస్తుండటం విశేషం. గత ఆర్థిక సంవత్సరం (20 24-25) డిపాజిట్లలో వృద్ధి 10.30 శాతంగానే ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2023-24)లో 13.5 శాతంగా ఉండటం గమనార్హం. ఈ క్రమంలో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 9-11 మధ్య డిపాజిట్లలో వృద్ధిరేటు ఉండవచ్చని అంచనా. అందుకే స్పెషల్ డిపాజిట్ స్కీములకు బ్యాంకర్లు శ్రీకారం చుడుతున్నారు.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థలైన కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలూ ప్రత్యేక డిపాజిట్ పథకాలను ప్రకటించాయి. కరెంట్, సేవింగ్స్ ఖాతాదారుల కోసం ప్రత్యేకంగా కెనరా బ్యాంక్ ‘కెనరా ట్రూఎడ్జ్’ అనే డిపాజిట్ స్కీమును తీసుకొచ్చింది. పలు ఆర్థిక ప్రయోజనాలను దీనిద్వారా అందిస్తున్నది. ఇక యూనియన్ బ్యాంక్ ‘యూనియన్ వెల్నెస్ డిపాజిట్’ను పరిచయం చేసింది. ఇందులో ఆరోగ్య బీమాతోపాటు ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) లాభాలను డిపాజిటర్లు అందుకోవచ్చు.