LIC | ‘బాబ్బాబు.. మీరనుకుంటున్నట్టు మా సంస్థ మరీ తీసిపారేయదగ్గదేమీ కాదు. కాస్త చూడండయ్యా!’
67 ఏండ్ల చరిత్ర… 1.2 లక్షల మంది ఉద్యోగులు… దేశవ్యాప్తంగా రూ.46 లక్షల కోట్ల ఆస్తులు… కోట్లాదిమంది పాలసీదారులు… ప్రపంచంలోనే టాప్ బీమా సంస్థల్లో ఒకటిగా పేరు… ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) రికార్డులివి. అయితే, ఇదంతా గతం.. బీజేపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలతో ‘ఎల్ఐసీ ఎంతో గొప్ప’దని చెప్పుకొనే దౌర్భాగ్యం ప్రస్తుతం దాపురించింది.
హైదరాబాద్, జూన్ 23 (స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ): ‘భారతీయ ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఇంకా శక్తివంతమైన సంస్థే. దేశీయంగా కొత్త బిజినెస్ ప్రీమియంలలో 60 శాతానికిపైగా మార్కెట్ వాటా ఎల్ఐసీదే’ ఇటీవల అమెరికాలో జరిగిన ఓ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వేదికగా సంస్థ ఉన్నతోద్యోగులు, ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాటలు. కిందటేడాది మే నెలలో స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన సమయంలో ఎల్ఐసీ షేరు విలువ రూ.949గా ఉండేది. ప్రస్తుతం రూ.620-640 మధ్య ఊగిసలాడుతున్నది. అంటే, ఏడాది వ్యవధిలో మూడింటా ఒకవంతు షేరు విలువ పడిపోయింది.
దీంతో ఎల్ఐసీ పరపతిపై గ్లోబల్ ఇన్వెస్టర్లలో, ఆర్థిక సంస్థల్లో నమ్మకం సడలిపోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ప్రతిష్ఠకు ఢోకా లేదని, సంస్థ విలువ 48 బిలియన్ డాలర్ల కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నదని బుజ్జగించే ప్రయత్నాలను చేస్తున్నారు. ప్రముఖ ఇంగ్లీష్ వార్తా సంస్థ సీఎన్‌బీసీ-టీవీ18 కూడా ఇదే చెప్తున్నది. కొద్దిరోజుల్లో సింగపూర్, హాంకాంగ్, బ్రిటన్‌లో జరుగనున్న ఆర్థిక సమావేశాల్లోనూ ఎల్ఐసీ అంశంపై మాట్లాడి, ఇన్వెస్టర్లను ఒప్పించడంపై అధికారులు కసరత్తు ప్రారంభించినట్టూ వివరించింది.
ఎల్ఐసీని మసకబార్చిన బీజేపీ
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాన్ని పూడ్చుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం హడావుడిగా ఎల్ఐసీ ఐపీవోను ప్రవేశపెట్టడం, కంపెనీ విలువను తక్కువ చేస్తూనే.. భారీ ధరకు షేర్‌ను కోట్ చేయడం కొంప ముంచింది. ఇక దేశంలో ఏ పెద్ద మ్యూచువల్ ఫండ్ చేయనంతగా భారీగా ఎల్ఐసీ.. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టడం, హిండెన్‌బర్గ్ నివేదికతో అదానీ గ్రూప్‌నకు నష్టం వాటిల్లడం తెలిసిందే. ఇవన్నీ బీమా దిగ్గజాన్ని కష్టాల్లోకి నెట్టాయని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
అందుకే కిందటేడాది రూ.5.54 లక్షల కోట్ల మార్కెట్ విలువతో దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఎల్ఐసీ.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.3.46 లక్షల కోట్లకు పడిపోయిందని అంటున్నారు. బీజేపీ సర్కారు అనాలోచిత నిర్ణయాలే దీనికి కారణమని వారంతా విశ్లేషిస్తున్నారు. ఇక ఎల్ఐసీ ప్రీమియం ఆదాయం గత ఏడాది మార్చిలో రూ.42,319 కోట్లవగా, ఈ ఏడాది మార్చికి 32 శాతం క్షీణతతో రూ.28,716 కోట్లకే పరిమితమైంది.