Sovereign Gold Bonds | సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) 5 ఏండ్ల లాకిన్ పీరియడ్‌తో 8 ఏండ్ల కాలపరిమితిని కలిగి ఉంటాయి. ఈ బాండ్లు కొన్న 5 ఏండ్ల తర్వాతే ముందస్తు ఉపసంహరణలకు వీలుంటుంది. అంటే 6, 7, 8 సంవత్సరాల్లో మదుపరులు ఎప్పుడైనా తమ పెట్టుబడులను వెనుకకు తీసుకోవచ్చన్నమాట. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తేదీలను ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే 2017-18 సిరీస్‌లో ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ విజ్ఞప్తులకు అర్హత ఉన్న 4 విడుతలకుగాను చివరి తేదీలు విడుదలయ్యాయి. అయితే వీటి దరఖాస్తులకున్న గడువులు ఈ నెలలోనే ముగుస్తుండటం గమనార్హం. ఎస్‌జీబీల్లో మదుపు చేసినవారు ఈ అవకాశాన్ని వదులుకుంటే తదుపరి ప్రకటనదాకా ఆగాల్సిందే. ఇక ఆర్బీఐ ప్రకటించిన ఆ వివరాల్లోకి వెళ్తే..
ఎస్‌జీబీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపరులు రిడెంప్షన్ షెడ్యూల్‌ను జాగ్రత్తగా గమనించాలి. మనం కొన్న బాండ్లు ఏ ఆర్థిక సంవత్సరం, అందులో ఏ సిరీస్‌కు చెందినవో తప్పక తెలిసి ఉండాలి. అవి జారీ అయిన తేదీలనూ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనకు అవసరమైతే మెచ్యూరిటీకి ముందే రిడెంప్షన్ (బాండ్ల నగదీకరణ)కు వీలుపడుతుంది. ఇక ఇందుకు సంబంధించిన దరఖాస్తులను ఎన్ఎస్డీఎల్/సీడీఎస్ఎల్/ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్/రిసీవింగ్ ఆఫీసులకు పంపాలి. ఆర్బీఐ ఇచ్చిన గడువులోగా దరఖాస్తుల్ని అందజేస్తేనే రిడెంప్షన్‌కు వీలుంటుంది.
సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే ప్రభుత్వ సెక్యూరిటీలు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. ఈ బాండ్లు గ్రాముల లెక్కన ఉంటాయి. వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలైతే గరిష్ఠంగా 4 కిలోలు.. ట్రస్టులు, నిర్దేశిత సంస్థలు 20 కిలోల బంగారానికి సమానంగా పెట్టుబడులు పెట్టవచ్చు. భౌతిక బంగారానికి ప్రత్యామ్నాయంగా ఈ ఎస్జీబీలను కేంద్రం 2015 నవంబర్‌లో పరిచయం చేసింది. దేశంలో నగలు, ఇతరత్రా రూపాల్లో నిరుపయోగంగా ఉండే బంగారం పరిమాణాన్ని తగ్గించాలన్నదే ఈ బాండ్ల లక్ష్యం. ఇక మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) బంగారం ధరల ఆధారంగా ఈ బాండ్ల రేట్లు, రాబడులుంటాయి. ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై ఏటా 2.5 శాతం వడ్డీరేటు కూడా లభిస్తుంది. 6 నెలలకోసారి మదుపరి బ్యాంక్ ఖాతాలో జమవుతుంది. రిడెంప్షన్ తర్వాత కూడా ఖాతాలోనే తుది మొత్తాలు జమవుతాయి.
ఈ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని ఆర్బీఐ ఏప్రిల్ 16గా నిర్ణయించింది. సిరీస్ 3లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు మార్చి 17 నుంచి ఏప్రిల్ 7 వరకు ఎప్పుడైనా విజ్ఞప్తి చేసుకోవచ్చు.
ఈ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని ఆర్బీఐ ఏప్రిల్ 23గా నిర్ణయించింది. సిరీస్ 4లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు మార్చి 24 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎప్పుడైనా విజ్ఞప్తి చేసుకోవచ్చు.
ఈ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని ఆర్బీఐ ఏప్రిల్ 30గా నిర్ణయించింది. సిరీస్ 5లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు మార్చి 31 నుంచి ఏప్రిల్ 21 వరకు ఎప్పుడైనా విజ్ఞప్తి చేసుకోవచ్చు.
ఈ బాండ్ల ముందస్తు ఉపసంహరణ తేదీని ఆర్బీఐ వచ్చే నెల మే 6గా నిర్ణయించింది. సిరీస్ 6లో మదుపు చేసిన ఇన్వెస్టర్లు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్‌కు ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 28 వరకు ఎప్పుడైనా విజ్ఞప్తి చేసుకోవచ్చు.