హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఈసారి కూడా మెరుగైన ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రూ.8,593 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసుకున్నది. క్రితం ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన దాంతో పోలిస్తే రూ.136 కోట్లు అదనంగా సమకూరినట్టు బుధవారం రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. ఇందులో సరుకు రవాణా ద్వారా అత్యధికంగా రూ.5,634 కోట్లు ఆదాయం నమోదైంది. గతేడాది కంటే ఈ సారి 6.7 శాతం అదనంగా సమకూరింది. అలాగే ప్రయాణికుల ద్వారా రూ.2500 కోట్లు ఆదాయం నమోదు కాగా, ఇతర మార్గాల ద్వారా రూ.459 కోట్లు ఆదాయం నమోదైనట్టు వారు ప్రకటించారు.
హైదరాబాద్-ఆమ్స్టర్డమ్ మధ్య కేఎల్ఎం ఫ్లైట్
హైదరాబాద్, సెప్టెంబర్ 3: హైదరాబాద్ నుంచి ఆమ్స్టర్డమ్ మధ్య డైరెక్ట్ విమాన సర్వీసును ప్రారంభించింది కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్‌లైన్స్. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబైల నుంచి నేరుగా విమాన సర్వీసును అందిస్తున్న సంస్థ..నాలుగో నగరంగా హైదరాబాద్ నిలిచిందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి మార్టిన్ స్టీనెన్ తెలిపారు. ఫార్మా హబ్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ నుంచి నేరుగా విమాన సర్వీసును ప్రారంభించడంతో ఇరు నగరాల మధ్య రాకపోకలు పెరగడంతోపాటు ఎగుమతులు కూడా పుంజుకోనున్నాయన్నారు. ప్రస్తుతం భారత్‌కు వారంలో 22 విమాన సర్వీసులు నడుపుతున్న సంస్థ..ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 27కి పెంచుకోనున్నట్టు ప్రకటించారు.