హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తేతెలంగాణ): పౌల్ట్రీ ఉత్పత్తులపై జీఎస్టీ పేరుతో ప్రభుత్వాలు ఇబ్బడిముబ్బడిగా పన్నులు వసూలు చేస్తున్నాయని, దీంతో ఈ పరిశ్రమ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నదని ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ఐపీఈఎంఏ), పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్సింగ్ బయాస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు నిర్వహించనున్న 16వ పౌల్ట్రీ ఎక్స్పో పోస్టర్ను ఆయన శుక్రవారం హైదరాబాద్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముడి సరుకు వ్యయాలు పెరగడం, దాణా ఉత్పత్తులు, సోయా మీల్, పౌల్ట్రీ పరికరాలపై జీఎస్టీ విధిస్తుండటంతో ఈ పరిశ్రమ ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, వెంటనే ప్రభుత్వాలు జీఎస్టీ మినహాయింపునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పౌల్ట్రీ రంగంలో సాంకేతికత ఆవిష్కరణలను ప్రదర్శించడానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలను ఒక్కతాటిపైకి తేవాలనే ఉద్దేశంతో ఈ నెల చివర్లో పౌల్ట్రీ ఇండి యా ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ ఎక్స్పోకి 50కి పైగా దేశాల నుంచి సుమారు 400 మంది పాల్గొనే అవకాశాలున్నాయన్నారు. దేశ ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి, పోషకాహార సంక్షేమానికి మూలస్తంభమైన పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం అండగా నిలవాలని లక్షలాది పౌల్ట్రీ రైతుల తరపున ప్రభుత్వానికి ఐపీఈఎంఏ విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి సోయా మీల్, ప్రాసెసింగ్ యంత్రాలపై జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
జంతువుల వ్యాధుల నుంచి కాపాడేందుకు వ్యాక్సిన్ దిగుమతులకు సత్వర అనుమతులు కల్పించాలన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం సమస్యను నివారించేందుకు దేశవ్యాప్తంగా పాఠశాలల భోజన కార్యక్రమాలలో గుడ్డును చేర్చడానికి మద్దతివ్వాలని కోరారు. పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో 2024 సమాచారం కోసం www.poultryindia.co.inని సం ప్రదించాలని ఉదయ్సింగ్ బయాస్ కోరారు.