న్యూఢిల్లీ, జనవరి 24: అంతర్జాతీయ టెలివిజన్ మార్కెట్లో ఓ సరికొత్త జాయింట్ వెంచర్‌కు తెరలేపే దిశగా సోనీ, టీసీఎల్ సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే జపాన్‌కు చెందిన సోనీ కార్పొరేషన్, చైనాకు చెందిన టీసీఎల్ ఎలక్ట్రానిక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్‌లు ఈ మేరకు ఓ ప్రకటన సైతం చేశాయి. ఓ నయా గ్లోబల్ కంపెనీ ఏర్పాటుకు తమ రెండు సంస్థల మధ్య అవగాహనా ఒప్పందం (ఎంవోయూ) కూడా కుదిరినట్టు పేర్కొన్నాయి. దీని ప్రకారం సోనీ టీవీల వ్యాపారం టీసీఎల్ గుప్పిట్లోకి వెళ్తున్నది. త్వరలో రాబోయే నూతన సంస్థలో టీసీఎల్కే మెజారిటీ వాటా ఉండనున్నది మరి. 51 శాతం దక్కుతుంది.
మిగతా 49 శాతం వాటా సోనీకి ఉంటుంది. జాయింట్ వెంచర్ పాలన, రోజువారీ కార్యకలాపాలు, కొత్త మాడళ్ల పరిచయం, టీవీల తయారీ, రవాణా, అమ్మకాలు అన్నింటినీ టీసీఎల్ చూసుకుంటుంది. కాగా, ఈ ఏడాది మార్చికల్లా తుది ఒప్పందాలు జరుగవచ్చునని చెప్తున్నారు. రెగ్యులేటరీ అనుమతులు, ఇతరత్రా ఆమోదాలకు లోబడి ఈ డీల్ ఉంటుంది. 2027 ఏప్రిల్‌లో వ్యాపార, ఉత్పాదక కార్యకలాపాలు మొదలయ్యే వీలున్నది.
టీసీఎల్, సోనీ కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేస్తున్నా.. ఎప్పట్లాగే వాటి బ్రాండ్లు కొనసాగనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న సోనీ, టీసీఎల్ టెలివిజన్లు అలాగే అమ్మకానికి ఉంటాయి. టీవీ సెగ్మెంట్ నుంచి సోనీ బయటకు వెళ్లిపోవట్లేదు మరి. కానీ నేరుగా ఇకపై ఈ టీవీల వ్యాపారాన్ని సోనీ నిర్వహించదని అంటున్నారు. ఈ బాధ్యత టీసీఎల్ చూసుకుంటుంది. అయితే సోనీ బ్రాండ్ ముఖ్యంగా బ్రావియా టీవీలు, హోమ్ ఆడియో ఉత్పత్తులకు కస్టమర్ కేర్ అంతా టీసీఎల్ చూసుకోనున్నది. టెక్నాలజీ, ఇతరత్రా అంశాల్లో సోనీ మద్దతు టీసీఎల్‌కు ఉంటుందని తెలుస్తున్నది.
స్మార్ట్ టీవీల రాకతో గ్లోబల్ టెలివిజన్ తయారీ మార్కెట్లో పోటీ తీవ్రతరమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఈ ఒప్పందం రావడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. ప్రస్తుతం సోనీ, టీసీఎల్, సామ్సంగ్, ఎల్జీ, షియామీ, హైసెన్స్ తదితర సంస్థలదే మార్కెట్లో హవా. కాగా, చైనాకు చెందిన టీసీఎల్, హైసెన్స్.. దక్షిణ కొరియా సంస్థలు సామ్సంగ్, ఎల్జీ.. జపాన్ కంపెనీ సోనీ.. ఉత్తర అమెరికాలో వ్యాపార విస్తరణపై దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే మార్కెట్లో దూకుడు మీదున్న టీసీఎల్‌తో జట్టు కడితే ప్రయోజనకరమని సోనీ భావించినట్టు తెలుస్తున్నది. పైగా సామ్సంగ్, ఎల్జీలనూ గట్టి దెబ్బకొట్టినట్టు అవుతుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.