Minister KTR | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): ఔషధాల తయారీలో ప్రపంచ దిగ్గజం, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ సంస్థ ప్రతినిధుల బృందం బుధవారం అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుతో బోస్టన్‌లో సమావేశమైంది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను భారీగా విస్తరించే విషయమై వారు ఈ సందర్భంగా మంత్రితో చర్చించారు. 350 మంది ఉద్యోగులతో హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు సనోఫీ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ప్రతినిధి బృందం.. హైదరాబాద్‌లోని తమ కేంద్రం గ్లోబల్ టాలెంట్ హబ్‌లలో ఒకటని పేర్కొంది.
సనోఫీ గ్లోబల్ హబ్ తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం వృద్ధికి మరింత దోహదపడుతుందని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచ హెల్త్ టెక్ మక్కాగా తీర్చిదిద్దేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలకు దీన్నో ముందడుగుగా అభివర్ణించారు. కాగా, సనోఫీ వంటి పెట్టుబడులు ఆరోగ్య సంరక్షణ రంగంలో తెలంగాణను మరింత ముందుకు నడిపేందుకు దోహదపడటమే కాకుండా, సాంకేతికతలో ఇంకా ముందుకు సాగడానికి స్ఫూర్తిగా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సనోఫీతోపాటు ఎన్నో సంస్థలు హైదరాబాద్‌కు వస్తుండటం రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
పై హెల్త్ క్యాన్సర్ దవాఖాన ఇక్కడే
‘పై హెల్త్’ హైదరాబాద్‌లో అత్యాధునిక సమీకృత క్యాన్సర్ దవాఖానతోపాటు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. పై హెల్త్ సహ వ్యవస్థాపకులు డాక్టర్ బాబీ రెడ్డి బుధవారం బోస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సమీకృత క్యాన్సర్ దవాఖాన, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు పై హెల్త్ ముందుకు రావడం ఆనందకరమని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. పై హెల్త్‌తో తెలంగాణలో భవిష్యత్తులో ఆరోగ్య సంరక్షణ రంగం మరింత వేగంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
నిక్కీ హేలీతో మంత్రి కేటీఆర్ భేటీ
Nikki
అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అమెరికా మాజీ రాయబారి, సౌత్ కరోలినా రాష్ట్ర మాజీ గవర్నర్ నిక్కీ హేలీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్, అమెరికా సంబంధాల్లో తెలంగాణ రాష్ర్టానికి, హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యతను గురించి ఈ సందర్భంగా కేటీఆర్ ఆమెకు వివరించారు. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాలు తదితర అంశాలపై ఇరువురూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న సందర్భంగా ఆమెకు ముందుగాను శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్.