Savings | ఆర్థిక వ్యక్తిత్వ వికాసం పొదుపు, పెట్టుబడులతోనే ఇనుమడిస్తుంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లలో మీరు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. పర్సనల్ ఫైనాన్స్‌లో ఈ రెండింటికి అంత ప్రాధాన్యత ఉన్నది మరి. అయితే చిన్న వయసు నుంచి పొదుపు, పెట్టుబడులకు దిగితేనే వాటి ప్రయోజనాలను ఎక్కువగా అందుకోవచ్చన్నది మరువద్దు. అందుకే యుక్త వయసులోనే లేదా సంపాదన ప్రారంభించిన తొలినాళ్లలోనే పక్కా ప్లానింగ్‌తో పొదుపు, మదుపునకు దిగాలని గుర్తుంచుకోండి.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: ఏటా రూ.1.5లక్షలదాకా పెట్టుబడి పెట్టవచ్చు. రిస్క్ తక్కువ. ఐటీ చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లనూ ఎంచుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్ అనేవి స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే లాభదాయకం. ఈఎల్ఎస్ఎస్కు పన్ను ప్రోత్సాహకాలూ లభిస్తాయి.
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్: బంగారం అనేది ఓ సురక్షిత పెట్టుబడి సాధనం. నగల రూపంలోనే కాదు.. గోల్డ్ ఈటీఎఫ్‌ల రూపంలోనూ ఇన్వెస్ట్‌మెంట్‌కు దిగవచ్చు. స్టాక్ మార్కెట్లలో మదుపు చేసేవారికి అక్కడి ఒడుదొడుకులను తట్టుకొనేందుకు, ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించేందుకు గోల్డ్ చక్కగా ఉపయోగపడుతుంది. సిల్వర్ ఈటీఎఫ్‌లూ ఉన్నాయి.
పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీం: ఎలాంటి రిస్క్లనూ ఇష్టపడనివారు పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలను ప్రయత్నించవచ్చు. కేంద్ర ప్రభుత్వం భరోసా వీటికున్న బలం. ఆకర్షణీయ వడ్డీరేటు, గ్యారంటీడ్ రిటర్న్స్ ఈ పథకాల సొంతం.
యులిప్స్: యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు. అటు జీవిత బీమా, ఇటు పెట్టుబడిగా పనికొస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి అనువైనవి. సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్స్, పన్ను ప్రోత్సాహకాలు వంటి ఉంటాయి. ఎక్స్పర్ట్స్ సలహాలతో ముందుకెళ్తే ఎక్కువ ప్రయోజనం.
బాండ్లు: ప్రస్తుతం చాలా ప్రభుత్వ బాండ్లు ద్రవ్యోల్బణ సవాళ్లను అధిగమించే ప్రతిఫలాలను అందిస్తున్నాయి. పైగా రిస్క్ తక్కువ. నిర్ణీత ఆదాయం ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్లు, కేంద్రం తరఫున రిజర్వ్ బ్యాంక్ జారీచేసే ట్రెజరీ బిల్లుల్లోనూ మదుపునకు వీలుంటుంది. కార్పొరేట్ బాండ్లకూ డిమాండ్ ఉంటున్నది.
ఎఫ్డీ-ఆర్డీ: బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)కు మన దేశంలో ఎంతటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిర్ధిష్ట వడ్డీరేటు, నిర్ణీత కాలపరిమితితో ఎలాంటి రిస్క్ లేకుండా ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే బ్యాంకులు అందించే టర్మ్ డిపాజిైట్లెన రికరింగ్ డిపాజిట్ల (ఆర్డీ)నూ పరిశీలించవచ్చు. మంత్లీ ఇన్కమ్ ప్లాన్లూ ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ పథకాలు: కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీములను కూడా మదుపరులు ప్రయత్నించవచ్చు.