హైదరాబాద్/కందుకూరు, జనవరి 5: రాష్ర్టానికి చెందిన స్టార్టప్ స్మార్ట్‌గ్రీన్ ఆక్వాకల్చర్..హైదరాబాద్‌కు సమీపంలోని కందుకూరు వద్ద శీతల పాంత్రాల్లో మాత్రమే పెరిగే రెయిన్బో ట్రౌట్ చేపల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పింది. ఈ కేంద్రాన్ని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కంపెనీ ఫౌండర్, ఎండీ ఆదిత్యా రిత్విక్ నర్రా మాట్లాడుతూ..రూ.50 కోట్ల పెట్టుబడితో ఐదు ఎకరాల స్థలంలో నెలకొల్పిన ఈ యూనిట్‌తో 200 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు.
1,200 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఈ యూనిట్లో ప్రస్తుతం 300 మెట్రిక్ టన్నుల చేపలను ఉత్పత్తి చేస్తుండగా, భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. 15 డిగ్రీల కంటే తక్కువ వేడిలో చేపలను పెరిగే విధంగా ప్రత్యేకంగా డ్రమ్ములను నెలకొల్పినట్టు, బయత వాతావరణానికి తట్టుకునే విధంగా డిజైన్ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ఇక్కడ నెలకొల్సిన చేపల పెంపకం దేశానికి తలమానికం కావాలని ఆకాంక్షించారు.