న్యూఢిల్లీ, డిసెంబర్ 26: చిన్న షేర్లు పెద్ద లాభాలు పంచాయి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టినవారికి అత్యధిక రాబడిని పంచాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై నమ్మకం ఉండటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఎగబడి పెట్టుబడులు పెట్టడంతో సూచీలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. బ్లూచిప్ సంస్థలతోపాటు చిన్న, చితక సంస్థల షేర్లు కదంతొక్కాయి.
ఈ నెల 23 వరకు బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఏకంగా 12,144.15 పాయింట్లు లేదా 28.45 శాతం లాభపడింది. అలాగే మిడ్‌క్యాప్ ఇండెక్స్ కూడా 9,435.09 పాయింట్లు లేదా 25.61 శాతం ఎగబాకింది. కానీ, 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 6,299.91 పాయింట్లు లేదా 8.72 శాతం మాత్రమే పెరిగింది.
ఈ నెల 12 ముగిసేనాటికి బీఎస్ఈ స్మాల్‌క్యాప్ చారిత్రక గరిష్ఠ స్థాయి 57,827.69కి చేరుకోగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 49,701.15కి చేరుకున్నది. ప్రాంతీయంగా ఉండే ఇన్వెస్టర్లు ఎక్కువశాతం చిన్న స్థాయి స్టాక్లను కొనుగోలు చేస్తుంటారు, అలాగే విదేశీ పెట్టుబడిదారులు బ్లూచిప్ సంస్థలు లేదా అతిపెద్ద సంస్థల్లో తమ పెట్టుబడులు పెడుతుంటారు. మిడ్‌క్యాప్ ఇండెక్స్ సరాసరి బ్లూచిప్ సంస్థల్లో ఐదోవంతుని, స్మాల్‌క్యాప్ సంస్థలు పదో వంతు కలిగివుండనున్నాయి. వచ్చే ఏడాదిలోనే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు ఇదే తరహాలో లాభాలు పంచే అవకాశాలున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనావేస్తున్నాయి.
‘స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు మెరుగైన ప్రదర్శనగావించాయి. ఈ రంగాలు అత్యధిక వృద్ధి నమోదు చేసుకోవడం, అనుకూల మార్గదర్శకాలు, పెట్టుబడిదారులు ఆసక్తి చూపారు. రియల్ ఎస్టేట్, మౌలికం, హెల్త్‌కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
– పాల్కా అరోరా చోప్రా, మాస్టర్ క్యాపిటల్ సర్వీసెస్ డైరెక్టర్