Financial Management | ప్రశాంతమైన జీవనాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి. మీ ఆర్థిక స్థితి ఇందుకు ఎంతగానో దోహదపడుతుంది. అందుకు తెలివైన నిర్ణయాలతో, చక్కని ఆర్థిక ప్రణాళికతో మీ సంపదను పెంచుకుంటూపోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ సంపాదనకు విలువ, మీకు గౌరవం లభిస్తాయి. ప్రధానంగా ఆర్థిక లక్ష్యాల సాధనకు క్రమశిక్షణ చాలా అవసరం. దానికి ఈ 6 సూత్రాలతో ప్రయత్నించండి.
లక్ష్యం
లక్ష్యాన్ని ఎంచుకొని కదిలితే ఉత్సాహంగా ముందుకెళ్లవచ్చు. అదిలేని ప్రయాణం గమ్యాన్ని చేరదు. అందుకే ప్రతీదానికీ ఓ టార్గెట్ అనేది ఉండాలి. ఆర్థికపరమైన అంశాలకూ ఇదే వర్తిస్తుంది. మనం ఎంచుకొనే లక్ష్యమే మనకో మార్గాన్ని ఏర్పర్చగలదు. సంపాదన, పొదుపు అన్నీ దానిపైనే ఆధారపడి ఉంటాయి. సొంతిల్లు, రిటైర్మెంట్ ఫండ్, పిల్లల ఉన్నత చదువులు, పెండ్లిళ్లు ఇలా అన్ని కలలు నేరవేరగలవు.
బడ్జెట్-పొదుపు
నగదును ఆదా చేయాలన్నా, అప్పులను తప్పించుకోవాలన్నా.. మీ ఖర్చులపై కన్నేస్తేనే సాధ్యం. అందుకే మీరు మీకోసం ఓ నెలవారీ బడ్జెట్‌ను ఏర్పర్చుకోవాలి. అవసరమైనంత మేరకే ఖర్చులు పెట్టండి. ఖర్చు చేసే ముందు ఇది మనకెంత వరకు ఉపయోగకరం అని ఆలోచించండి. ఈ క్రమంలోనే నెలనెలా చెల్లింపులు, అవసరాలు, కోరికలు, ఆదాలను గమనిస్తూ ముందుకెళ్లండి. ప్రతినెలా మీరు పెట్టే ఖర్చు ఏదైనా ఓ పుస్తకంలో రాసుకోండి. ఆ తర్వాత ముందటి నెలతో పోల్చి చూడండి. దేనికి అనవసరంగా ఖర్చు చేస్తున్నామో మీకే తెలిసిపోతుంది. ఈ క్రమంలోనే ప్రతినెలా ఉంటున్న ఖర్చులపై ఓ అంచనాకు వచ్చి చక్కని బడ్జెట్ రూపొందించుకోండి. ఇక ఆండ్రాయిడ్, ఐవోఎస్ మొబైల్ యూజర్ల కోసం ఎన్నో ఉచిత బడ్జెట్ ప్లానింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి.
పెట్టుబడి
జీవితంలో ఆర్థిక లక్ష్యాలను సాధించాలంటే పొదుపు ఒక్కటే సరిపోదు. పెట్టుబడులూ ముఖ్యమే. మీ సంపద వృద్ధికి కావాల్సినంత మేర నగదును ఇన్వెస్ట్ చేయండి. అందుకోసం ఉన్న అవకాశాలను పరిశీలించండి. వివిధ పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకోండి. అలాగే అందులో ఉన్న రిస్క్పైనా ఓ అంచనాకు రావడం మంచిది. నెలనెలా పెట్టుబడులు పెట్టే పథకాలుంటాయి. మన ఆదాయ, వ్యయాలకు తగ్గట్టుగా ఎంచుకుని ముందుకెళ్తే ఆశించిన ప్రతిఫలాలను అందుకోగలం. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లు, సిప్‌లు, గోల్డ్ బాండ్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనుకూలం. రియల్ ఎస్టేట్ ద్వారా భూములను కొనుగోలు చేయవచ్చు. డాక్యుమెంట్లు, అనుమతులను జాగ్రత్తగా చూసి నిర్ణయం తీసుకోవాలి.
అత్యవసర నిధి
ఎప్పుడు, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఎవరికీ తెలియదు. అందుకే అత్యవసర నిధి తప్పక ఉండాలి. మీకు ఎలాంటి ఆదాయం లేకపోయినా.. కనీసం 6 నెలలపాటు ఏ ఇబ్బందీ లేకుండా జీవించేంత నగదు నిల్వలతో ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఎన్ని ఒడుదొడుకులుంటున్నాయో చూస్తూనే ఉన్నాం. మార్కెట్ మందగమనంలో ఉన్నది. కంపెనీలు సైతం వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగ కోతలకు దిగుతున్నాయి. కాబట్టి ఆదాయం ఉన్నప్పుడే కొంత నగదును తీసి అత్యవసర నిధిని పోగేయాలి. తద్వారా ఈఎంఐలు, కిరాణా, ఔషధ, ఇతర ఇంటి ఖర్చుల కోసం ఇతరుల వద్ద చేయిచాచే దుస్థితి రాదు. ఇక ఆర్థిక ఇబ్బందులు తలెత్తినప్పుడు అప్పులిచ్చిన బ్యాంకులకు, ఇతర సంస్థలకు ఆ విషయాన్ని ముందుగానే తెలియజేయండి. అప్పుడు కొంత వెసులుబాటును పొందే అవకాశం ఉంటుంది.
రుణ భారం
ప్రతి ఒక్కరికీ రుణాల అవసరం ఉంటుంది. అయితే ఆ రుణాలు మితిమీరితే అప్పుల ఊబిలో కూరుకుపోతాం. కాబట్టి మోయలేనంత రుణ భారం ఎప్పుడూ ఉండకూడదు. అనవసరమైన వాటి జోలికెళ్తే అప్పుల తిప్పలే ఉంటాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డుల విషయంలో చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి. పర్సనల్ లోన్లపై వడ్డీభారం ఎక్కువగా ఉంటుంది. అత్యవసరమైతే తప్ప దానికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం. ఇక ఆన్లైన్ యాప్ లోన్లు ఎంత ప్రమాదకరంగా ఉంటున్నాయో చెప్పనక్కర్లేదు. మరీ అంత అవసరమైతే గోల్డ్ లోన్లను ట్రై చేయవచ్చు. వడ్డీ కూడా తక్కువే. వెంటనే నగదు చేతికొస్తుంది.
బీమాను మరువద్దు
బీమా అనేది అన్నిటికన్నా ముఖ్యం. జీవిత, ఆరోగ్య, వాహన, గృహ, వస్తు ఇలా ఏదైనాసరే దానికి బీమా అనేది తప్పనిసరి. నిజానికి కరోనా సమయంలో ఆరోగ్య బీమా ప్రాధాన్యత అందరికీ తెలిసొచ్చింది. అయితే బీమా అంటే మొక్కుబడిగా కాకుండా.. సమగ్రమైన రీతిలో ఉండాలి. అప్పుడే అది ప్రయోజనకరంగా, మనకు, మనవాళ్లకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బీమాను సేవింగ్స్‌లా చూడవద్దు. జీవిత బీమా అయినా, ఆరోగ్య బీమా అయినా.. ఏదైనాసరే గరిష్ఠ స్థాయిలో ఉండేలా చూసుకోండి. మనం లేనప్పుడు మనపై ఆధారపడేవారికి దన్నుగా నిలిచేదే జీవిత బీమా. కాబట్టి టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లను ఎంచుకుంటే ఉత్తమం. ఇక మనకున్న అన్ని ఆరోగ్య సమస్యలకు చికిత్స లభించేలా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మోటర్ ఇన్సూరెన్స్‌లో థర్డ్ పార్టీ బీమాను అశ్రద్ధ చేయవద్దు. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు.. దానిపై ఇన్సూరెన్స్‌నూ తీసుకోండి. దురదృష్టవశాత్తూ మీకేదైనా అయితే బీమాతో ఇైల్లెనా మిగులుతుంది. ఖరీదైన వస్తువులను కొన్నప్పుడు వాటికీ బీమా చేయించుకోవచ్చు.