హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది. దీంట్లో ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా..అలాగే కొత్తగూడెంలోని వీకే ఓసీ నుంచి 6.5 మిలియన్ టన్నులు, ఇల్లందులోని జేకే ఓసీ నుంచి 3.5 మిలియన్ టన్నులు, మంచిర్యాల జిల్లాలోని గోలేటీ ఓపెన్‌కాస్ట్ నుంచి 3 మిలియన్ టన్నుల చొప్పున బొగ్గును ఉత్పత్తిచేసింది.
ఉత్పత్తిని పెంచుకోవడం కోసం కొత్తగా ఆరు బ్లాక్‌లను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. వీటిలో చెన్నూరు సౌత్‌బ్లాక్, చింతగూడెం, వెంకటాపూర్, కోయగూడెం సహా మరో రెండు కోల్‌బ్లాక్‌లు ఉన్నాయి. ఈ ఆరు బ్లాక్‌లతో మరో 500 మిలియన్ టన్నుల బొగ్గును అధికంగా ఉత్పత్తి చేయవచ్చని సంస్థ అంచనావేసింది. ప్రస్తుతం రోజుకు 70 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, ఈ ఆరు బ్లాక్‌లతో 100 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని సంస్థ సీఎండీ ఎన్ బలరాం ధీమాను వ్యక్తంచేశారు.