Nirmala Sitaraman | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్ విషయమై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శుక్రవారం ప్రీ-బడ్జెట్ చర్చలు జరుపనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశం జైసల్మేర్లో జరుగనున్నది. ‘ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి అంశాలపై సంప్రదింపుల్లో రాష్ట్రాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని భావిస్తున్నాం. సుస్థిర అభివృద్ధికి ప్రోత్సాహం, ఆర్థిక సుస్థిరత విస్తరణకు తప్పనిసరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఇది సరైన ప్లాట్ ఫామ్’ అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. ఇటీవలి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.
‘ఆర్థిక ప్యాకేజీల కోసం వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్రాల నుంచి ప్రత్యేకమైన డిమాండ్లు వస్తాయి. పలు రాష్ట్రాలు అదనపు మద్దతు కోరే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)లకు కేంద్రంగా మారిన మహారాష్ట్ర.. ప్రత్యేక ప్యాకేజీ కోరే అవకాశం ఉంది’ అని మరో అధికారి చెప్పారు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు సుమారు రూ.20,000-రూ.30,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.15,000-రూ.20,000 కోట్లు, బీహార్ రాష్ట్రం రూ.5,000 – రూ.10,000 కోట్ల ప్యాకేజీ పొందే అవకాశం ఉంది.
శుక్రవారం జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో పలు రాష్ట్రాలు కొత్త మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు అంశాన్ని లేవనెత్తే అవకాశం ఉంది. పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడానికి ఖనిజాలు గల రాష్ట్రాలు కేంద్రం నుంచి, కేంద్ర వనరుల నుంచి అధిక వాటా కావాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.