న్యూఢిల్లీ, మార్చి 12: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ల్లోకి పెట్టుబడులు గత నెల ఫిబ్రవరిలో తగ్గుముఖం పట్టాయి. గతంతో పోల్చితే 26 శాతం పడిపోయి రూ.29,303 కోట్లకే పరిమితమయ్యాయి. అంతకుముందు నెల జనవరిలో రూ.39,688 కోట్లుగా, డిసెంబర్లో రూ.41,156 కోట్లుగా ఉండటం గమనార్హం.
స్టాక్ మార్కెట్ ఒడుదొడుకుల నడుమ స్మాల్, మిడ్‌క్యాప్ స్కీముల్లో పెట్టుబడులు క్రమేణా క్షీణిస్తున్నట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఫిబ్రవరిలో స్మాల్క్యాప్లోకి ఇన్వెస్ట్మెంట్లు రూ.3,406 కోట్లుగా, మిడ్‌క్యాప్‌లోకి రూ.3,722 కోట్లుగా ఉన్నాయి. జనవరిలో ఇవి వరుసగా రూ.2,866 కోట్లు, రూ.3,063 కోట్లుగా ఉన్నాయి.
ఇక సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)లోకి గత నెల వచ్చిన పెట్టుబడుల విలువ రూ.25,999 కోట్లుగా ఉన్నది. అయితే ఇది మూడు నెలల కనిష్ఠం. జనవరిలో రూ.26,400 కోట్లు, డిసెంబర్లో రూ.26,459 కోట్లుగా ఉన్నాయి. కాగా, థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి రూ.5,711 కోట్లు, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్‌ల్లోకి రూ.5,104 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
ఈక్విటీలు కాకుండా గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లోకి ఫిబ్రవరిలో రూ.1,980 కోట్ల పెట్టుబడులు రాగా, జనవరిలో ఇవి రూ.3,751 కోట్లుగా ఉండటం గమనార్హం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మాత్రం ఫిబ్రవరిలో రూ.6,525 కోట్లు తరలిపోయాయి.