హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : సింగరేణి ప్రాంతంలో అరుదైన కీలక ఖనిజాల(రేర్ ఎర్త్ ఎలిమెంట్స్)ను గుర్తించి ఉత్పత్తి చేయడానికి ఒక ప్రయోగాత్మక ప్లాంటు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ వెల్లడించారు. ఈ మేరకు హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం కేంద్ర ప్రభుత్వ అధికారిక పరిశోధన సంస్థ ఎన్ఎఫ్టీడీసీ(నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు.
సింగరేణి తరఫున ఎండీ ఎన్ బలరామ్, ఎన్ఎఫ్టీడీసీ నుంచి డైరెక్టర్ బాలసుబ్రమణియన్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల్లో లభ్యమవుతున్న అరుదైన కీలక ఖనిజాల ఉనికిని తెలుసుకోవడంతో వాటిని ఉత్పత్తి చేయడానికి ప్రయోగాత్మకంగా ఒక ప్లాంట్‌ను కొత్తగూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.
దీనికి సంబంధించిన సాంకేతిక సహాయాన్ని ఎన్ఎఫ్టీడీసీ సంస్థ నుంచి తీసుకుంటున్నామన్నారు. ఈ ప్రయోగాత్మక ప్లాంట్‌లో సింగరేణి ఓవర్ బర్డెన్ మట్టిలో లభించే అరుదైన కీలక ఖనిజాలతో పాటు, కంపెనీ థర్మల్ విద్యుత్ కేంద్రం నుండి వెలువడే ఫె్లై యాష్, ఇతర వేస్ట్ మెటీరియల్స్‌లో లభ్యమయ్యే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను గుర్తిస్తామన్నారు.