హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అనేక అడ్డంకులు, అవాంతరాలు, అనుమతుల్లో జాప్యం. ఇలా మొత్తంగా 9 ఏండ్ల సింగరేణి సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. రాష్ట్రం బయట సంస్థ చేపట్టిన తొలి బొగ్గు గని ‘నైనీ’లో ఉత్పత్తిని ప్రారంభించబోతున్నది. ఈ బొగ్గు బ్లాక్‌ను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం వర్చ్యువల్‌గా ప్రారంభించనున్నట్లు సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్ తెలిపారు.
ఇంతకాలం రాష్ట్రం వరకే పరిమితమైన సింగరేణి.. దీంతో ఇతర రాష్ర్టాల్లోకి అడుగుపెట్టడం ఒక చారిత్మాత్మక ఘట్టంగా ఆయన పేర్కొన్నారు. 2016లో కేంద్ర బొగ్గు శాఖ సింగరేణికి ఈ గనిని కేటాయించిందని, అనుమతులు సాధించి, బొగ్గు తవ్వకం ప్రారంభించేందుకు తొమ్మిదేండ్లు పట్టిందన్నారు. ఈ గనిలో 340.78 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీసేందుకు అవకాశముంది. పూర్తిస్థాయికి చేరుకుంటే కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి కానున్నది. సింగరేణిలో 17 ఓపెన్‌కాస్ట్ గనుల కన్నా ఇదే పెద్దది.