హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ) : కోల్‌మైన్స్ పెన్షన్ పథకం అమలు కోసం టన్ను బొగ్గుపై సెస్ రూపంలో రూ. 20 వసూలు చేయాలని సింగరేణి నిర్ణయించింది. సంస్థ ద్వారా విక్రయించే బొగ్గుపై సెస్ వసూలు చేసి కోల్‌మైన్స్ పెన్షన్ స్కీమ్‌లో జమచేయాలని శుక్రవారం జారీచేసిన సర్క్యులర్ పేర్కొంది. కోల్‌మైన్స్ పెన్షన్ స్కీం కింద ఇప్పటికే రూ.727 కోట్లకు పైగా నిధులుంటే డీహెచ్ఎఫ్ఎల్లో కోలిండియా పెట్టుబడి పెట్టింది. కానీ ఈ మొత్తం వెనక్కి తీసుకోలేదు.
దాదాపు ఆ నిధులన్నీ దుర్వినియోగమైనట్టే. ఈ పరిస్థితుల్లో పెన్షన్ స్కీమ్‌ను కొనసాగించలేని కోలిండియా తరచూ హెచ్చరిస్తున్నది. 1998 కోల్‌మైన్స్ పెన్షన్ పథకం స్థిరపరిచేందుకు టన్ను బొగ్గుపై రూ. 20 సెస్‌గా వసూలు చేసి, పెన్షన్ పథకానికి జమచేయాలని కోలిండియా ఇటీవలే ఆదేశాలిచ్చింది. దీంతో సింగరేణి సంస్థ రూ. 20 సెస్ వసూలు చేయాలని తాజాగా సర్క్యులర్ జారీచేసింది. సీఎండీ ఎన్ బలరామ్‌కు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రామచందర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్ మొత్తం పెంచేందుకు కృషిచేయాలని కోరారు.