న్యూఢిల్లీ, జూన్ 4: దేశీయ మార్కెట్లో బుధవారం వెండి ధరలు పరుగులు పెట్టాయి. ఈ ఒక్కరోజే ఢిల్లీలో కిలో ధర ఏకంగా రూ.1,900 ఎగిసి రూ.1,02,100కు చేరింది. సాధారణ కొనుగోలుదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ పెరిగిందని అఖిల భారత సరఫా అసోసియేషన తెలిపింది. కాగా, ఈ ఏడాది మార్చి 19న మునుపెన్నడూ లేనివిధంగా కిలో వెండి ధర ఆల్టైమ్ హై రికార్డును నెలకొల్పుతూ రూ.1,03,500 పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజా ధరలు ఇలాగే పెరుగుతూపోతే ఆ రికార్డును అధిగమించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బంగారం ధరలూ క్రమేణా పెరుగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పసిడి 10 గ్రాములు రూ.260 పెరిగి రూ.99,260గా నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. 24 క్యారెట్ తులం రూ.110 అందుకొని రూ.95,450కి చేరింది. నగలు, ఇతరత్రా ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.100 పెరిగి రూ.90,900గా ఉన్నది.
ఇక గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 9.43 డాలర్లు పుంజుకొని 3,362.6 డాలర్లుగా ట్రేడైంది. దేశీయ మార్కెట్లో ఈ ఏడాది ఏప్రిల్ 22న ఆల్టైమ్ హైని తాకుతూ తులం 24 క్యారెట్ బంగారం ధర తొలిసారి రూ.1,01,600 పలికిన సంగతి విదితమే.