Gold-Silver Price | వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ సంకేతాల మధ్య దేశీయంగా బలమైన డిమాండ్ దేశ రాజధాని ఢిల్లీలో రూ.11,500 పెరిగి కిలోకు రూ.1.92లక్షలకు చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. మంగళవారం కిలోకు రూ.1,80,500 పలికిన విషయం తెలిసిందే. బుధవారం స్థానిక రిటైల్ మార్కెట్లో రూ.11,500 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31న వెండి కిలోకు రూ.89,700 ఉండగా.. ప్రస్తుతం ఏడాదిలోనే 114.04 శాతం ధరలు పెరిగాయి. ఇక ఈ ఏడాది అక్టోబర్ 10న వెండి ఒకే రోజు ధర భారీగా పెరిగింది. ఆ సమయంలో దాని రేటు కిలోకు రూ.8,500 పెరిగి రూ.1,71,500కి చేరుకుంది. మరో వైపు 24 క్యారెట్లలో బంగారం బుధవారం రూ.800 పెరిగి తులానికి రూ.1,32,400కి చేరుకుంది. యూఎస్ డాలర్ బలహీనపడడం.. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న బలమైన అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.
పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి సైతం ధరలు పెరగడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 0.16శాతం పెరిగి 4,201.70 డాలర్లకు చేరింది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించే అవకాశం ఉందని.. ఫెడ్ ఆర్థిక అంచనాలు, ద్రవ్యోల్బణం, ఉపాధి మార్కెట్‌పై దాని వైఖరి కీలకమైన మిరే అసెట్ షేర్ ఖాన్ పరిశోధనా విశ్లేషకుడు ప్రవీణ్ సింగ్ పేర్కొన్నారు. స్పాట్ వెండి ధరలు 1.53 శాతం పెరిగి ఔన్సుకు రికార్డు స్థాయిలో 61.60 డాలర్లకు చేరుకున్నాయి. మంగళవారం సిల్వర్ 4.58శాతం పెరిగి ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో 60.82 డాలర్లకు చేరింది. సోమవారం ఔన్స్‌కు 58.161 వద్ద ముగిసింది. మంగళవారం వెండి తొలిసారిగా ఔన్స్‌కు 60 డాలర్ల మార్క్ దాటి సరికొత్త రికార్డు గరిష్టాన్ని తాకిందని సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తర్వాత తన విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి ఉన్నప్పటికీ మార్కెట్ విశ్లేషకులు 25 బేసిస్ పాయింట్ వడ్డీ రేటు తగ్గింపు ఉండవచ్చని ఆశిస్తున్నారు.