న్యూఢిల్లీ, జనవరి 9 : దేశీయ మార్కెట్లో వెండి ధరలు మళ్లీ పెరిగాయి. శుక్రవారం ఢిల్లీ స్పాట్ మార్కెట్లో కిలో రేటు రూ.6,500 పుంజుకొని రూ.2,50, 000గా నమోదైంది. గురువారం రూ.12,500 పడిపోయిన విషయం తెలిసిందే. అయితే బుధవారం రూ.5,000 ఎగబాకి తొలిసారి రూ.2,56,000 మార్కును తాకింది. ఇదిలావుంటే 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 ఎగిసి రూ.1,41,700కు చేరిందని అఖిల భారత సరఫా అసోసియేషన్ తెలిపింది.
భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ దేశ, విదేశీ స్టాక్ మార్కెట్లలో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిడి వైపునకు కదులుతున్నారని, అందువల్లే ధరల పెరుగుదల అని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్లో 24 క్యారెట్ తులం రేటు రూ.1,310 పెరిగి రూ.1,39,310గా ఉన్నది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) విలువ రూ.1,200 అందుకుని రూ.1,27,700 వద్ద స్థిరపడింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,479.38 డాలర్లు పలికింది.