Siver rate : వెండి ధరల (Silver rates) కు ఇప్పట్లో ఫుల్స్టాప్ పడేలా లేదు. శరవేగంగా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కిలో వెండి ధర తొలిసారి రూ.3 లక్షల మార్క్ దాటింది. మార్చి డెలివరీ కాంట్రాక్ట్ ఒక్క రోజులోనే రూ.13,553 పెరిగి రూ.3,01,315 చేరింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర రికార్డు స్థాయిలో 94.35 డాలర్లకు పెరిగింది. మరోవైపు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,480కు చేరింది.
అంతర్జాతీయంగా వెండికి నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల కాలంలో పెద్దఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు, బలహీనంగా కదలాడుతోన్న అమెరికా డాలర్.. ఇలా ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాల వడ్డింపు ఫలితంగా అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణం పెరిగి – వృద్ధి మందగించటం తదితర కారణాలవల్ల కూడా ఇన్వెస్టర్లు వెండి, బంగారంపై పెట్టుబుడులు సురక్షితమని భావిస్తున్నారు.
దాంతో బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. ఫలితంగా వాటి ధరలు పరుగులు తీస్తున్నాయి. వెండికి ఆభరణాల రంగాన్ని మించి, పారిశ్రామిక గిరాకీ అధికం. సెమీకండక్టర్, సౌర విద్యుత్తు, విద్యుత్తు వాహన విభాగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతోంది. ధర పెరుగుతున్నందున, ఎక్కువ మంది వెండి ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. ధర బాగా అధికమయ్యేందుకు ఇది దోహదపడుతున్నది.