న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుతం బంగారు ఆభరణాలకే ఉంటున్న హాల్‌మార్క్.. ఇకపై వెండి నగలకూ రాబోతున్నదా? అంటే అవుననే సంకేతాలనే ఇస్తున్నాయి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వర్గాలు. తప్పనిసరి హాల్‌మార్కింగ్ విధానం కిందికి వెండి ఆభరణాలు, కళాఖండాలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది మరి. గత ఏడాది మొదలు దేశ, విదేశీ మార్కెట్లలో వెండి ధరలు దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
బుధవారం కిలో ఆల్‌టైమ్ హైకి చేరి రూ.2,56,000 పలికింది. ఈ నేపథ్యంలోనే మోసాలకు చెక్ పెట్టేలా వినియోగదారుల రక్షణార్థం వెండి నగలకూ హాల్‌మార్కింగ్ విధానాన్ని అవలంబించాలని చూస్తున్నట్టు బీఐఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నిజానికి సిల్వర్ హాల్‌మార్కింగ్ స్వచ్ఛంద ప్రాతిపదికన ఇప్పటికే దేశీయంగా అమల్లో ఉన్నది. అయితే పరిశ్రమ మాత్రం సిల్వర్ హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తూ వస్తున్నది. కాగా, రెగ్యులేటరీ, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని బీఐఎస్ డైరెక్టర్ జనరల్ సంజయ్ గార్గ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వెండికి అత్యంత ఆదరణ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి.