హైదరాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వాములవ్వాలని, యువతకు నైపుణ్యాలను పెంచి.. వారికి ఉపాధి కల్పించేందుకు తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
యూనివర్సిటీ బోర్డుతోపాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో గురువారం సచివాలయంలో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున 150 ఎకరాల స్థలంతోపాటు రూ.100 కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ నిర్వహణ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు.
బోర్డు చైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీకి బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇకపై తమ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందన్నారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పి.. 2028 ఒలింపిక్స్‌లో దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామన్నారు. ఇందుకోసం రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో సందేహం లేదన్నారు. కాగా, దసరా తర్వాత కోర్సులను ప్రారంభించనున్నట్టు బోర్డు సూచనప్రాయంగా వెల్లడించింది. తొలి ఏడాది 2వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి శ్రీధర్ బాబు, బోర్డు కో చైర్మన్ శ్రీని రాజు, సభ్యులు దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీష్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. కాగా, స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై సీఎంను అభినందించారు. స్పెయిన్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.