హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబరు 14 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దూరదృష్టి, మంత్రి కేటీఆర్ అలుపెరగని కృషి ఫలితంగా హైదరాబాద్ మహానగరం పరిధిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. ఫలితంగా అంతకంతకూ నివాసప్రాంతాలు పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ మహానగరంలో రియల్-నిర్మాణ రంగాల్లో గణనీయ వృద్ధి చోటుచేసుకున్నది. గత ఆగస్టు నెలలోనే రూ.3,461 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరగడమే దీనికి నిదర్శనం.
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 22 శాతం వృద్ధి నమోదైనట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ తన తాజా సర్వేలో వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఇండ్ల అమ్మకాలపై ఈ సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. నిరుడితోపాటు ఈ ఏడాదిలో ప్రతి నెలా ఎన్ని ఇండ్ల అమ్మకాలు జరిగాయి? వాటి విలువ ఎంత? అనే వివరాలను క్రోడీకరించింది. ఇదే ఏడాది జూలైతో పోలిస్తే 20 శాతం ఎక్కువ ఇండ్ల అమ్మకాలు జరిగాయని ఈ సర్వేలో తేలింది. ఇది నానాటికీ హైదరాబాద్ రియల్-నిర్మాణ రంగాల్లో పెరుగుదలను స్పష్టం చేస్తున్నది.
ఒక్కనెలలోనే 6,493 ఇండ్ల అమ్మకాలు
హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో గత ఆగస్టు ఒక్క నెలలోనే 6,493 ఇండ్లు అమ్ముడుపోయాయి. యూనిట్ల వారీగా తీసుకుంటే నిరుడు ఆగస్టు కంటే ఇది 17 శాతం అధికం. ఈ ఇండ్ల రిజిస్ట్రేషన్ విలువ రూ.3,461 కోట్లు. ఇందులో అత్యధికంగా డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్నాయి. అమ్ముడైన ఇండ్ల ల్లో 1000-2000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్నవి ఏకంగా 70 శాతంగా ఉన్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా అంటే 43 శాతం అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలో 39 శాతం అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లో 17 శాతంగా నమోదయ్యాయి.
ఏడాదిలో 23,829 కోట్ల లావాదేవీలు
ఈ ఏడాదిలో జనవరి నుంచి ఆగస్టు వరకు నాలుగు జిల్లాల పరిధిలో రూ.23,829 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు జరిగాయి. నిరుడితో పోలిస్తే రూ.933 కోట్లు అధిక లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది మార్చి, మే, ఆగస్టు నెలల్లో రూ.3 వేల కోట్లకు పైగా విలువైన ఇండ్ల అమ్మకాలు నమోదవడం విశేషం. నిరుడి కంటే ఈ ఏడాది ఆస్తుల విలువ కూడా గణనీయంగా పెరిగింది.