హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): రెరా నిబంధనల్ని ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ కంపెనీలకు, ఏజెంట్లకు షోకాజ్ నోటిసులు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని రెరా చైర్మన్ ఎన్ సత్యనారాయణ ఆదేశించారు. రెరాలో రిజిస్ట్రేషన్ కాకుండా ప్రకటనలు, వ్యాపార కార్యకలాపాలు, ప్రీ-లాంచ్‌లు చేపట్టడం చట్ట విరుద్ధమని, కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అతిక్రమణదారులను ఆయన హెచ్చరించారు.
సుమధుర ఇన్ఫ్రా, నీమ్స్ బోరో గ్రూప్, ఎక్స్‌లెన్స్ ప్రాపర్టీస్, ప్రెస్టేజ్ గ్రూప్ ప్రాజెక్టులు, సనాలి గ్రూప్, అర్బన్ యార్డ్స్ ప్రాజెక్టు, హ్యాపీ డ్రీమ్ హోమ్స్, విరతా డెవలపర్స్, రి వెండల్ ఫామ్స్, కావూరి హిల్స్, సెవెన్ హిల్స్, బిల్డాక్స్ రియల్ ఎస్టేట్స్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామన్నారు. మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు రెరా రిజిస్ట్రేషన్ ఉండి కూడా ప్రకటనలు, ఇతర వ్యాపార కార్యకలాపాలలో రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రదర్శించకపోవడం కూడా శిక్షార్హమేనన్నారు.
ఈ విషయంలో జేబీ నేచర్ వ్యాలీ, జేబీ ఇన్ఫ్రా ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులిచ్చామని చెప్పారు. ఇక నిబంధనల్ని ఉల్లంఘించిన ఏజెంట్లకు ఫైన్, శిక్ష రెండూ ఉంటాయని సత్యనారాయణ స్పష్టం చేశారు. హ్యాపీ డ్రీమ్స్, విరతా డెవలపర్స్, అర్బన్ యార్డ్స్, సెవెన్ హిల్స్ ప్రాజెక్టుల ఏజెంట్లకు షోకాజ్ నోటీసులిచ్చామన్నారు. కొనుగోలుదారులు కూడా ఎలాంటి మోసాలకు గురికాకుండా రియల్ ఎస్టేట్ కంపెనీకి రెరా రిజిస్ట్రేషన్‌తోపాటు హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీహెచ్ఎంసీ, యూడీఏ, మున్సిపల్, ఇతర స్థానిక సంస్థల అనుమతులు ఉన్నదీ, లేనిదీ పరిశీలించుకుని, నమ్మకం కుదిరితేనే కొనాలని సూచించారు.