EV Cars – ICE Cars | ఆకాశాన్నంటే రీతిలో పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే పర్యావరణ హిత ఎలక్ట్రిక్ కార్ల వైపు కస్టమర్లు మొగ్గు చూపారు.. ప్రభుత్వ విధాన నిర్ణేతలు సైతం ఈవీ కార్లు, హైబ్రీడ్ టెక్నాలజీ కార్లు, వాహనాల వాడకాన్ని ప్రోత్సహించారు. కానీ ‘పార్క్ +’ అనే సంస్థ ‘ఎలక్ట్రిక్ వాహనాల’పై నిర్వహించిన అధ్యయనం షాక్ ఇస్తోంది. దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు నగరాల పరిధిలోని 500 మంది ఎలక్ట్రిక్ కార్ల యజమానులు.. ఈవీ కార్లంటేనే బెంబేలెత్తి పోతున్నారు. 51 శాతం మంది ఈవీ కార్ల ఓనర్లు తదుపరి తాము ఐసీఈ కార్లనే కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఈవీ కార్లలో టాటా నెక్సాన్.ఈవీ అత్యంత పాపులర్ చాయిస్గా ఉందని 61 శాతం మంది, 19 శాతం మంది టాటా పంచ్.ఈవీ సానుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇక బీవైడీ ఈవీ కారు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నా.. అధిక ధరలు, లిమిటెడ్ టెస్ట్ డ్రైవ్ లభ్యత వంటి అంశాలు సమస్యాత్మకంగా మారాయని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.
గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 91 వేల ఈవీ కార్లు అమ్ముడయ్యాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) గణాంకాలు చెబుతున్నాయి. వీరిలో 88 శాతం మంది ఈవీ కార్ల ఓనర్లలో తమ కార్ల చార్జింగ్ ప్రాథమిక ఆందోళనగా ఉందని చెబుతున్నారు. ఈవీ కార్ల ప్రయాణ దూరంపై కూడా ఆందోళన చెందుతున్నారని తేలింది. పలువురు ఈవీ కార్ల డ్రైవర్లు 50 కి.మీ దూరంలోని ఇంటర్ సిటీ ట్రిప్స్ కే మొగ్గు చూపుతున్నారని, దీనికి చార్జింగ్ వసతులు ప్రధాన కారణం అని ‘పార్క్+’ సర్వేలో తేలింది.
సంప్రదాయ పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే ఈవీ కార్లలో ఏ మరమ్మతు వచ్చినా స్థానిక మెకానిక్ లు పరిష్కరించలేకపోతేున్నారని, నిర్వహణ వ్యయం ప్రధాన అంశంగా మారిందని 73 శాతం మంది చెప్పారు. మరమ్మతు ఖర్చులు భరించలేని స్థాయిలో ఉండటంతోపాటు రీసేల్ వాల్యూ పడిపోవడం ఆందోళనకరంగా మారిందని 33 మంది సర్వేక్షకులు చెప్పారు. ఈవీ కార్ల రీసేల్ మార్కెట్ ఇంకా డెవలపింగ్ దశలోనే ఉందని, బ్యాటరీ క్వాలిటీ టెస్టింగ్ వసతుల కొరత ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు. 30 శాతం మంది తమ ఈవీ కార్ల విలువ అంచనా వేయడం కూడా కస్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. సంప్రదాయ ఐసీఈ కార్ల విలువ అంచనా వేయడంతో పోలిస్తే ఈవీ కార్ల విలువ అంచనాపై అనిశ్చితి నెలకొంది.