Shiv Nadar | దానం చేయాలంటే డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. మంచి మనసు కూడా ఉండాలి. ఇందులో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ (Shiv Nadar) కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. ఏటా కోట్లాది రూపాయలు దానం (Philanthropy) చేస్తుంటుంది. ఈ ఏడాది కూడా దేశంలోనే అత్యంత దయాగుణం కలిగిన వ్యక్తిగా శివ్ నాడార్ నిలిచారు.
‘ఎడెల్‌గివ్-హురున్ ఇండియా దాతలు 2025’ (EdelGive Hurun India Philanthropy List) జాబితా ప్రకారం.. 2025లో దాతృత్వ కార్యక్రమాలకు అత్యధిక మొత్తం అందించిన వారి జాబితాలో శివ్ నాడార్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి 26 శాతం అధికంగా నాడార్ కుటుంబం రూ.2,708 కోట్లు దానం చేసింది. ఇక రిచ్ లిస్ట్‌లో తొలి స్థానంలో ఉండే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుటుంబం మాత్రం ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా అంబానీ కుటుంబం రూ.626 కోట్లు దానం చేసింది.
ఈ జాబితాలో బజాజ్ కుటుంబం రూ.446 కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. కుమార్ మంగళం బిర్లా, కుటుంబం రూ.440 కోట్లతో నాలుగో స్థానంలో, గౌతమ్ అదానీ (Gautam Adani) ఫ్యామిలీ రూ.386 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాయి. నందన్ నీలేకనీ (రూ.365 కోట్లు), హిందూజా ఫ్యామిలీ (రూ.298 కోట్లు), రోహిణి నీలేకనీ (రూ.204 కోట్లు), సుధీర్, సమీర్ మెహతా (రూ.189 కోట్లు), సైరస్, అదర్ పూనవాలా (రూ.173 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. దేశంలోని టాప్ పది మంది దాతలు మొత్తం రూ.5,834 కోట్ల విరాళాలిచ్చారు. 2024తో పోలిస్తే ఇది 26 శాతం అధికం. మొత్తం విరాళాల్లో ఇది 56 శాతానికి సమానం.
Also Read..
Elon Musk | జీతం ట్రిలియన్ డాలర్లు.. ఆనందం పట్టలేక రోబోతో కలిసి డ్యాన్స్ చేసిన మస్క్.. VIDEO