Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు జోరుగా కొనసాగాయి. బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు ఒకశాతం వరకు లాభపడ్డాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. దాంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో చమురు ధరలు సైతం భారీగా పడిపోయాయి. సానుకూల సంకేతాల మధ్య రెండోరోజు మార్కెట్లు రాణించాయి. అన్నిరంగాల్లో భారీగా కొనుగోళ్లు జరుడంతో మార్కెట్లలో జోష్ కనిపించింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 30 షేర్ల బీఎస్ఇ సెన్సెక్స్ ఉదయం 82,448.80 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఆ తర్వాత వరుస కొనుగోళ్లతో సెన్సెక్స్ చివరి వరకు లాభాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 82,339.57 పాయింట్ల కనిష్టానికి తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 82,815.91 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. చివరకు 700.40 పాయింట్ల లాభపడి 82,755.51 పాయింట్ల వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ 200.40 పాయింట్లు పెరిగి 25,244.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.6 శాతం పెరిగాయి. నిఫ్టీలో టైటాన్ కంపెనీ, ఇన్ఫోసిస్, ఎంఅండ్ఎం, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అత్యధికంగా లాభాలను ఆర్జించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐషర్ మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ నష్టపోయాయి. ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, టెలికాం, హెల్త్‌కేర్, మీడియా ఒకటి నుంచి రెండుశాతం వరకు పెరగడంతో అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి.
టైమెక్స్ గ్రూప్ ఇండియా షేర్లు 5శాతం పతనమయ్యాయి. ఈఐడీ ప్యారీ, ఎంసీఎక్స్ ఇండియా, హ్యుందాయ్ మోటార్, మాక్స్ ఫైనాన్షియల్, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, నారాయణ హృదయాలయ, భారతి ఎయిర్టెల్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మాక్స్ ఫైనాన్షియల్, ఎల్టీ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, విశాల్ మెగా మార్ట్ వంటి వాటితో సహా బీఎస్ఈలో దాదాపు వంద స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకాయి.