Share Market Crash | గ్లోబల్ మార్కెట్లో ప్రతికూల పవనాలతో దేశీయ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం స్టాక్ మార్కెట్‌కు బ్లాక్ మండేగా పేర్కొంటున్నారు. 180కిపైగా దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతిగా చైనా.. అమెరికా ఉత్పత్తులపై 34శాతం సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ప్రపంచ దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగనుందనే భయాందోళన వ్యక్తమయ్యాయి. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుంటున్నారు. దాంతో మార్కెట్లో భారీగా అమ్మకాలు సాగుతున్నాయి. ట్రంప్ టారిఫ్ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా యాక్షన్ మోడ్‌లోకి వచ్చింది.
ఈ అంశంపై పీఎంవో, పరిశ్రమలు, విదేశాంగ, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ప్రభుత్వం బుధవారం కీలక సమావేశం నిర్వహించబోతున్నది. ఎగుమతిదారులతో పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఓ ముఖ్యమైన సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నది. ఎగుమతిదారులతో చర్చించిన తర్వాత ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ప్రభుత్వం త్వరలోనే ఎగుమతులకు ప్రోత్సాహక పథకాన్ని అమలు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న ట్రంప్ పలు దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించిన తర్వాత.. దాని ప్రభావంపై అంచనా వేసేందుకు కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. అమెరికా మార్కెట్లోకి వెళ్లే భారతీయ వస్తువులపై ట్రంప్ 26 శాతం సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ కమిటీ భారత మార్కెట్లపై అమెరికా సుంకాల ప్రభావాన్ని కూడా అంచనా వేయనుంది. టారిఫ్‌ను ఎలా తగ్గించాలనే దానిపై కమిటీ పరిశీలిస్తున్నది. ఇక సోమవారం సెన్సెక్స్ దాదాపు 4వేల పాయింట్ల వరకు పతనమైంది. సెన్సెక్స్ ఉదయం 71,449.94 వద్ద ప్రారంభమైంది. గత సెషన్లో 75,364.69 పాయింట్ల ముగిన విషయం తెలిసిందే. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సెన్సెక్స్ 4.28 శాతం వరకు పతనమైంది. నిఫ్టీ సైతం ఒక దశలో వెయ్యి పాయింట్ల వరకు తగ్గింది. సోమవారం భారత స్టాక్ మార్కెట్ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను చవిచూశారు. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3,86,01,961 లక్షల కోట్లకు పడిపోయింది. శుక్రవారం నాటికి రూ.404,09,600 లక్షల కోట్లుగా ఉండగా.. మార్కెట్ ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద రూ.18,07,639 కోట్లు ఆవిరైంది.