న్యూఢిల్లీ, నవంబర్ 6: సావరిన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ)లో పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. 2017-18 ఎస్జీబీ సిరీస్ మెచ్యూరిటీ తేదీలను ఆర్బీఐ ప్రకటించింది. దీంతో ఇన్వెస్టర్లకు 317 శాతం రాబడులు వస్తున్నాయి. కాగా, గత కొన్నేండ్లుగా బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత నెలలో ఆల్‌టైమ్ హై రికార్డులూ నమోదైన సంగతీ విదితమే. ఇదిలావుంటే 2017-18 ఎస్జీబీ సిరీస్-6 తుది విమోచన విలువను ఆర్బీఐ విడుదల చేసింది. గురువారమే (నవంబర్ 6) దీని మెచ్యూరిటీ తేదీ. ఈ సిరీస్ తొలి ఇష్యూ 2017 నవంబర్ 6న జరిగినది తెలిసిందే.
సావరిన్ గోల్డ్ బాండ్లకు ఫిక్స్డ్ వడ్డీరేటు ఉంటుంది. ఏడాదికి ఇది 2.50 శాతం. ఏటా రెండుసార్లు వడ్డీని మదుపరుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. తుది వడ్డీ చెల్లింపులు మాత్రం మెచ్యూరిటీ సమయంలో అసలు మొత్తాలతోనే జరుగుతాయి. కాగా, వ్యక్తిగత మదుపరులు ఈ ఎస్‌జీబీల రిడెంప్షన్‌పై ప్రత్యేకంగా మూలధన లాభాల పన్ను మినహాయింపును పొందగలరు. అయితే కంపెనీలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) లేదా ఇతరులకు వర్తించదు.
సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ జారీ చేస్తుంది. ఎస్జీబీ స్కీంలో గోల్డ్ బాండ్లు జారీ అయిన తేదీ దగ్గర్నుంచి 8 ఏండ్లు దాటిన తర్వాత మెచ్యూరిటీ ఉంటుంది. నిజానికి ఐదేండ్ల లాకిన్ పీరియడ్ తర్వాత ఎప్పుడైన ఉపంసహరించుకోవచ్చు. ఇక 2017-18లో వచ్చిన ఈ 6 సిరీస్‌కు సంబంధించి ఫైనల్ రిడెంప్షన్ వాల్యూను ఆర్బీఐ ఒక్కో యూనిట్‌కు రూ.12,066గా నిర్ణయించింది. బాండ్లు జారీ అయినప్పుడు ప్రామాణిక రేటు ప్రకారం గ్రాము విలువ రూ.2,945గానే ఉన్నది. ఆన్లైన్లో కొన్నవారికి రూ.50 రాయితీ వచ్చింది. దీంతో వారికి రూ.2,895కే లభించింది. ఈ లెక్కన ఇప్పుడు ఈ పెట్టుబడులపై వీరికి దాదాపు 317 శాతం రాబడులు వస్తున్నాయి. ఉదాహరణకు ఆర్బీఐ నిర్ణయించిన రిడెంప్షన్ వాల్యూ రూ.12,066 నుంచి ఈ రూ.2,895ని తీసేస్తే వచ్చే మొత్తం రూ.9,171 (వడ్డీ అదనం). దీన్ని (రూ.9,171) రూ.2,895తో భాగించి ఆ వచ్చే మొత్తాన్ని (రూ.3.1678) 100తో గుణిస్తే 316.78 శాతంగా తేలుతుంది. దీంతో పెట్టిన పెట్టుబడులపై 300 శాతానికిపైగా రాబడులను ఎస్జీబీ సిరీస్-6 ఇన్వెస్టర్లు పొందుతున్నారన్నమాట.