Reliance Loss | గతవారం ట్రేడింగ్లో టాప్ -10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.16 లక్షల కోట్లు పెరిగింది. టాప్-10 స్క్రిప్ట్ల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అత్యధికంగా లబ్ధి పొందగా, రిలయన్స్ భారీగా నష్టపోయింది. దీంతోపాటు ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ లాభ పడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) నష్టపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.39,358.5 కోట్లు పెరిగి రూ. 7,72,514.65 కోట్లకు చేరుకున్నది. మరో ప్రైవేట్ బ్యాంక్ కొటక్ మహీంద్రా బ్యాంకు ఎం-క్యాప్ రూ.23,230.8 కోట్లు లాభపడి రూ.3,86,264.80 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.23,141.7 కోట్లు పెరిగి రూ.4,22,654.38 కోట్లకు దూసుకెళ్లింది.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 21,047.06 కోట్లు పెరిగి రూ.5,14,298.92 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ ( ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.5,801 కోట్లు లాభపడి రూ.4,18,564.28 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,341.24 కోట్లు జత కలిసి రూ.6,14,644.50 కోట్ల వద్ద ముగిసింది. హెచ్యూఎల్ ఎం-క్యాప్ రూ.1,127.8 కోట్లు పెరిగి రూ.5,47,525.25 కోట్ల వద్ద నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.31,761.77 కోట్లు పతనమై రూ.17,42,128.01 కోట్ల వద్ద స్థిర పడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎం-క్యాప్ రూ.11,599.19 కోట్లు నష్టపోయి రూ. 11,93,655.74 కోట్ల వద్ద ముగిసింది. ఇక ఎల్ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,972.75 కోట్లు కోల్పోయి రూ.5,19,630.19 కోట్ల వద్ద సరిపెట్టుకున్నది.
గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 558.27 పాయింట్లు (1.02శాతం) లాభంతో ముగిసింది. గత శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి టాప్-10లో రిలయన్స్ సారధ్యం వహిస్తుండగా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్, ఎల్ఐసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, కొటక్ మహీంద్రా బ్యాంక్ నిలిచాయి.