ముంబై, జూన్ 5: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. గత నాలుగేండ్లుగా ఎన్నడూ లేనంత స్థాయిలో మంగళవారం నష్టపోయిన సూచీలు బుధవారం అంతే స్పీడ్‌తో పెరిగాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టే అవకాశాలు ఉండటంతో మదుపరులు తిరిగి కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో సూచీలు మూడు శాతానికి పైగా లాభపడ్డాయి.
30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 2,303.19 పాయింట్లు లేదా 3.20 శాతం లాభపడి తిరిగి 74 వేల మార్క్‌ను అధిగమించి 74,382.24 పాయింట్ల వల్ల ముగిసింది. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడమే ఇందుకు కారణం. మరో సూచీ నిఫ్టీ 735.85 పాయింట్లు లేదా 3.36 శాతం అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 22,620.35 వద్ద నిలిచింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలు ఒక దశలో నష్టాల్లోకి జారుకున్నప్పటికీ ఆ తర్వాత తేరుకొని లాభాల్లోకి వచ్చాయి.
ఇదే ట్రెండ్‌ను మార్కెట్ ముగిసేవరకు కొనసాగించాయి. సూచీలు భారీగా లాభపడంతో మదుపరులు ఎగిరిగంతేశారు. మంగళవారం 30 లక్షల కోట్ల సంపదను కోల్పోయిన మదుపరులు బుధవారం మాత్రం రూ.13.22 లక్షల కోట్ల సంపదను పోగేశారు. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల విలువ రూ.13,22,847.05 కోట్లు పెరిగి రూ.4,08,06,552.32 కోట్లకు (4.89 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది.