ముంబై, జూలై 21: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్ షేర్ల మద్దతుతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 442.61 పాయింట్లు లేదా 0.54 శాతం ఎగబాకి 82వేల స్థాయికి ఎగువన 82,200.34 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 516.30 పాయింట్లు పెరిగింది. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 122.30 పాయింట్లు లేదా 0.49 శాతం ఎగిసి 25వేల స్థాయిని దాటుతూ 25,090.70 వద్ద నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ లాభాల్లో, ఐటీ సూచీ నష్టాల్లో ఉన్నాయి.
బ్లూచిప్ స్టాక్స్ ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మదుపరులను పెద్ద ఎత్తున ఆకట్టుకున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్)గాను ఆయా సంస్థల ఆర్థిక ఫలితాలు ఆకర్షణీయంగా ఉండటమే ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. ఎటర్నల్, హిందాల్కో ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లూ పుంజుకున్నాయి. కాగా, హెవీ వెయిట్ షేర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) విలువ 3.29 శాతం పడిపోయింది. మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇన్వెస్టర్లను మెప్పించలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆసియా దేశాల్లోని ప్రధాన సూచీలు లాభాల్లో ముగిశాయి. దక్షిణ కొరియా, హాంకాంగ్ తదితర స్టాక్ మార్కెట్లు పెరిగాయి.