ముంబై, ఏప్రిల్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. ఏడు రోజులుగా సూచీలు పరుగులు పెడుతుండటంతో మదుపరుల సంపద కూడా అదే స్థాయిలో పెరుగుతూపోయింది. ఈ క్రమంలోనే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.36,65,542.83 కోట్లు పుంజుకుని రూ.4,30,47,876.05 కోట్లకు చేరింది. ఈ ఏడు రోజుల్లో బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 6,269.34 పాయింట్లు లేదా 8.48 శాతం ఎగబాకింది. అలాగే బుధవారం మళ్లీ 80వేల మార్కును కూడా దాటేసింది. ఈ ఒక్కరోజే 520.90 పాయింట్లు లేదా 0.65 శాతం పెరిగి 80,116.49 వద్ద సెన్సెక్స్ స్థిరపడింది. గత ఏడాది డిసెంబర్ 18 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. ఇక ఒకానొక దశలో 80,254.55 వద్దకు చేరింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 161.70 పాయింట్లు లేదా 0.67 శాతం అందిపుచ్చుకొని 24,328.95 వద్ద ముగిసింది.
ఐటీ, ఆటో షేర్లు మదుపరులను అమితంగా ఆకర్షించాయి. 4.25 శాతం, 2.34 శాతం చొప్పున పెరిగాయి. అలాగే విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, కలిసొచ్చిన అంతర్జాతీయ పరిణామాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చాయని ట్రేడింగ్ సరళిని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక సెన్సెక్స్ సంస్థల్లో హెచ్‌సీఎల్ టెక్ షేర్ విలువ అత్యధికంగా 7.72 శాతం లాభపడింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) చివరి త్రైమాసికమైన జనవరి-మార్చిలో కంపెనీ ఏకీకృత నికర లాభం 8.1 శాతం వృద్ధిచెంది రూ.4,307 కోట్లుగా నమోదైంది. ఇది ఇన్వెస్టర్లను ఆకట్టుకున్నది. టెక్ మహీంద్రా, టాటా మోటర్స్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతీ సుజుకీ షేర్లూ మెప్పించాయి. రియల్టీ, హెల్త్‌కేర్ షేర్లూ పరుగులు పెట్టాయి.