ముంబై, జూన్ 12 : గత కొన్ని రోజులుగా తీవ్ర ఊగిసలాటలో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కొలిక్కి వచ్చే అవకాశాలుండటం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగిరావడం మదుపర్లలో ఉత్సాహాన్నినింపింది. ఇరాన్‌తో యుద్ధం ముగిసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లు ర్యాలీ తీశాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లు ప్రారంభం నుంచే లాభాల బాట పట్టి చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ఒక శలో 1,780 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరికి మార్కెట్ ముగిసే సమయానికి 1,695.40 పాయింట్లు లేదా 2.30 శాతం అందుకొని 75,527.95 వద్ద నిలిచింది. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ తన కీలక మైలురాయి 23,600 పాయింట్లను అధిగమించింది. చివరకు 461.30 పాయింట్లు లేదా 1.99 శాతం ఎగబాకి 23,622.90 వద్ద ముగిసింది.
స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటంతో మదుపర్లు సంతోషం వెల్లివిరిసింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా నష్టాలనే చవిచూసిన మదుపర్లకు లాభాలు జోష్‌నిచ్చాయి. దీంతో వీరి సంపద రూ.9.66 లక్షల కోట్ల వరకు పెరిగింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.9,66,538.35 కోట్లు పెరిగి రూ.4,62,00,318.80 కోట్ల(4.84 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది.
క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో చమురు రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థలైన హెచ్‌పీసీఎల్ షేరు అత్యధికంగా 6.30 శాతం లాభపడగా, బీపీసీఎస్ షేరు 5.54 శాతం, ఇండియన్ ఆయిల్స్ షేరు 4.91 శాతం చొప్పున బలపడ్డాయి. వీటితోపాటు చమురుకు సంబంధించిన షేర్లలో విమానయానం, పెయింట్స్ రంగ షేర్లు కూడా దూసుకుపోయాయి.
టెస్లా, స్పేస్ఎక్స్ సారథి ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించారు. శుక్రవారం అమెరికా స్టాక్ ఎక్సేంజ్ నాస్డాక్లో స్పేస్ఎక్స్ షేర్లు నమోదైన నేపథ్యంలో మస్క్ సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. మదుపర్లు అమితాసక్తిని కనబర్చడంతో 150 డాలర్ల వద్ద షేర్ లిస్టింగైంది. ఈ క్రమంలోనే కంపెనీలో మస్క్‌కున్న వాటాలతో ఆయన సంపద ఏకంగా 1.05 ట్రిలియన్ డాలర్లకు ఎగిసింది. 75 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వచ్చిన స్పేస్ఎక్స్.. ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలిచింది. ఒక్కో షేర్ ధరను 135 డాలర్లుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, స్టాక్ మార్కెట్లో వచ్చిన అపూర్వ స్పందనతో స్పేస్ఎక్స్ మార్కెట్ వాల్యూ 2 ట్రిలియన్ డాలర్లను దాటేయడం గమనార్హం. మార్కెట్ క్యాపిటలైజేషన్ దృష్ట్యా టాప్-10 కంపెనీల్లో చేరింది.