Stocks | కెనడా, మెక్సికో, చైనాల నుంచి దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన టారిఫ్ అమల్లోకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా మంగళవారం భారీగా పతనం అయ్యాయి. విదేశీ మదుపర్లు నిర్విరామంగా పెట్టుబడులు ఉపసంహరిస్తుండటంతో వరుసగా మూడోసెషన్లోనూ నష్టాల పాలైన బీఎస్ఈ -50 ఇండెక్స్ సెన్సెక్స్ మంగళవారం 96 పాయింట్ల పతనంతో 73 వేల పాయింట్ల దిగువన స్థిర పడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 96.01 పాయింట్లు నష్టపోయి 72,989.93 పాయింట్ల వద్ద స్థిర పడింది. బీఎస్ఈ-30లో 18 స్టాక్స్ నష్టాలతో ముగిస్తే, 12 స్టాక్స్ లాభాలతో స్థిర పడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 452.4 పాయింట్ల నష్టంతో 72,633.54 పాయింట్ల కనిష్టానికి పతనమైనా ట్రేడింగ్ ముగిసే సమయానికి రికవరీ సాధించింది.
మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ వరుసగా పదో సెషన్లో నష్టాలతో ముగిసింది. 36.65 పాయింట్లు పతనమై 22,082.65 పాయింట్ల వద్ద స్థిర పడింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే 22 వేల దిగువన 21,974.45 పాయింట్ల వద్ద ట్రేడయింది. అంతర్గత ట్రేడింగ్‌లో నష్టాల నుంచి రికవరీ సాధించింది.
బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, ఇన్పోసిస్, మారుతి సుజుకి ఇండియా, టైటాన్, హిందూస్థాన్ యూనీ లివర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాలతో ముగిశాయి. మరోవైపు, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), జొమాటో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు లాభ పడ్డాయి.
ఆసియా మార్కెట్లలో టోక్యో, హాంకాంగ్, సియోల్ నష్టాలతో ముగిస్తే, షాంఘై లాభాలతో స్థిర పడింది. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం అమెరికా మార్కెట్లు నష్టపోయాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 1.37శాతం పతనమై 70.64 డాలర్లు పలుకుతోంది. సోమవారం నాడు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.4,788.29 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.