Stock Markets | ముంబై, జనవరి 13 : భారతీయ స్టాక్ మార్కెట్లలో వరుస నష్టాలు.. మదుపరులకు స్ట్రోక్ తెప్పిస్తున్నాయి. సోమవారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మరో 1,000 పాయింట్లకుపైగా పడిపోయింది. దేశ, విదేశీ ప్రతికూల పరిస్థితులు.. ఈక్విటీ మార్కెట్లను గట్టిగానే కుదిపేస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1,048.90 పాయింట్లు లేదా 1.36 శాతం దిగజారి 77వేల మార్కుకు దిగువన 76,330.01 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1,129.19 పాయింట్లు కోల్పోవడం గమనార్హం. 508 స్టాక్స్ 52 వారాల కనిష్ఠాన్ని తాకడం గమనించదగ్గ అంశం. ఇక నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ కూడా 345.55 పాయింట్లు లేదా 1.47 శాతం క్షీణించి 23,085.95 వద్ద ముగిసింది. దీంతో వరుసగా నాల్గోరోజూ సూచీలు నష్టాలకే పరిమితమైనైట్టెంది.
వరుస నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు.. మదుపరుల సంపదను లక్షల కోట్ల రూపాయల్లో కరిగించేస్తున్నాయి. గత నాలుగు రోజుల్లో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.24,69,243.3 కోట్లు హరించుకుపోయింది. సోమవారం మార్కెట్ సమయం ముగిసేనాటికి రూ.4,17,05,906.74 కోట్లు (4.82 ట్రిలియన్ డాలర్లు)గానే ఉన్నది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ రంగ షేర్ల పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. బీఎస్ఈ సెన్సెక్స్‌లో అత్యంత విలువైన 10 సంస్థల్లో ఐదింటి మార్కెట్ విలువ గత వారం రూ.1,85,952.31 కోట్లు పడిపోయింది. ఇందులో బ్యాంకింగ్ రంగ సంస్థలే ఎక్కువగా ఉండటం గమనార్హం. వీటిలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తోపాటు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కూడా ఉన్నది. గత వారం ట్రేడింగ్ జరిగిన ఐదు రోజుల్లో సెన్సెక్స్ 1,844.2 పాయింట్లు పతనమైన విషయం తెలిసిందే. దీంతో ఆయా సంస్థల మార్కెట్ విలువ కూడా బాగానే క్షీణించింది. ఫలితంగా మదుపరులు లక్షల కోట్ల రూపాయల్లో నష్టపోయారు. ఒక్క హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ విలువే ఈ 5 రోజుల్లో రూ.70వేల కోట్లకుపైగా పడిపోయింది. ఇదిలావుంటే మార్కెట్ విలువపరంగా సెన్సెక్స్‌లో అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.16.81 లక్షల కోట్లతో కొనసాగుతున్నది.