ముంబై, జనవరి 16: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా రెండు రోజులుగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థలైన ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు కదంతొక్కడంతోపాటు అమెరికా టారిఫ్‌ల భయాలు సద్దుమనగడం, అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ సూచీలు తిరిగి లాభాల్లోకి రాగలిగాయి. రూపాయి రికార్డు స్థాయిలో పతనం చెందడం, మరోవైపు, క్రూడాయిల్ ధరలు భారీగా పెరగడం, విదేశీ నిధులు తరలిపోయినప్పటికీ మదుపరులు కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
ఇంట్రాడేలో 750 పాయింట్లకు పైగా లాభపడి 84 వేల పైకి చేరుకున్న 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 187.64 పాయింట్లు అందుకొని 83,570.35 వద్ద స్థిరపడింది. మరోసూచీ నిఫ్టీ 28.75 పాయింట్లు అందుకొని 25,694.35 వద్ద నిలిచింది. మొత్తంమీద ఈవారంలో సెన్సెక్స్ 5.89 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 11 పాయింట్లు పెరిగింది. కార్పొరేట్ల ఆశాజనక ఆర్థిక ఫలితాలతో మార్కెట్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచిందని, అందరి అంచనాలను పటాపంచల్ చేస్తూ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు ప్రకటించడం మదుపరుల్లో ఉత్సాహన్ని నింపిందని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు.
ఇన్ఫోసిస్‌తోపాటు టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగియగా..ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్‌ఫార్మా, మారుతి షేర్లు నష్టపోయాయి. ఐటీ రంగ సూచీ అత్యధికంగా 3.41 శాతం లాభపడగా, బ్యాంకింగ్ 1.16 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.12 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించగా..కన్జ్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్, పవర్ రంగ షేర్లు ఢీలా పడ్డాయి.